రాష్ట్రంలో సమర్థవంతమైన నాయకత్వం అవసరం : ప్రొఫెసర్ చిన్నయసూరి - Jana Chaitanya Vedika
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 20, 2024, 10:50 AM IST
Jana Chaitanya Vedika Election Program in Guntur District : రాష్ట్రానికి నిర్దేశిత రాజధాని లేక అభివృద్ధిలో వెనుకబడిపోయిందని యూనివర్సీటీ ఆఫ్ హైదరాబాద్ పూర్వ ప్రొఫెసర్ కొండవీటి చిన్నయసూరి పేర్కొన్నారు. గుంటూరులో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎన్నికల తీరుతెన్నులు అనే అంశంపై ప్రొఫెసర్ కొండవీటి చిన్నయసూరితో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిటీజన్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి లక్ష్మణ్ రెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు.
అక్షరాస్యత, మానవాభివృద్ధి, నీటి పారుదల, మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్రం అభివృద్ధి చెందలేదని ప్రొఫెసర్ చిన్నయసూరి పేర్కొన్నారు. గత 50 ఏళ్లగా రాష్ట్రం అనేక రకాలుగా నష్టపోయిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సమర్థవంతమైన నాయకత్వం అవసరమని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ నెలలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎదురైన ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని మే నెలలో ఇళ్ల వద్దే పింఛన్లు పంపిణీ చేయాలని ఎన్నికల కమిషన్ను లక్ష్మణ్ రెడ్డి కోరారు. రాజీనామా చేసిన వాలంటీర్లు పోలింగ్ ఏజెంట్లు పెట్టేందుకు నేతలు యత్నిస్తున్నారని ఆరోపించారు.