Minister Kollu Ravindra on Excise Policy : నూతన ఎక్సైజ్ విధానంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. లోపభూయిష్టమైన మద్యం విధానాన్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. కల్తీ మద్యం వల్ల ప్రజలు ప్రాణాలు పోయాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా పోయిందని వాపోయారు.
మద్యపాన నిషేధం అని తర్వాత దశలవారీ అన్నారని మండిపడ్డారు. ఆ తర్వాత ఫైవ్‌స్టార్ హోటళ్లు అన్నారని, 3392 దుకాణాలు, 840 బార్లు కూడా ఆలాగే ఉంచారని దుయ్యబట్టారు. మద్యం ధరలు బాగా పెంచేయటంతో కల్తీ మద్యానికి ప్రజలు అలవాటు పడ్డారని, పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం వచ్చిందని గుర్తుచేశారు.
కేవలం వైఎస్సార్సీపీ పెద్దల స్వార్ధం, ప్రయోజనాల కోసమే మద్యం విధానం తెచ్చారని దుయ్యబట్టారు. వారి అక్రమాల కోసమే ఎక్సైజ్ శాఖను నిట్టనిలువునా చీల్చి సెబ్ అని పెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇసుక, మైనింగ్, మద్యంలో అక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయని మంత్రి ఆక్షేపించారు. మద్యానికి సంబంధించి 1.70 కోట్ల లీటర్ల అక్రమ మద్యం స్వాధీనమైందని, 70 వేల మంది అరెస్టు అయ్యారని గుర్తుచేశారు. మద్యం రేట్ల కారణంగా గంజాయి రవాణా కూడా బాగా పెరిగిందన్నారు.
ఒక్క గంజాయి కేసుల్లోనే 17 వేల 500 మంది అరెస్టు అయ్యారని, మద్యం నాణ్యతను కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. సొంత బ్రాండ్లను మాత్రమే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పెట్టి విక్రయించారన్నారు. కొత్త మద్యం పాలసీలో భాగంగా దుకాణాలను ప్రైవేటుకు అప్పగించామని స్పష్టం చేశారు. కేవలం దరఖాస్తుల ద్వారానే రూ.1800 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చిందని, 10 శాతం మేర దుకాణాలు కల్లు గీత కులాలకు రిజర్వు చేశామన్నారు.
అలాగే ప్రీమియం దుకాణాలను మహిళలకూ కేటాయించామని తెలిపారు. ప్రస్తుతం ఆటోమేటెడ్ ఆర్డర్లు కూడా స్వీకరించి అక్రమాలకు తావులేకుండా చేస్తున్నామన్నారు. మద్యం విక్రయధరలో 2 శాతాన్ని డీఅడిక్షన్, డ్రగ్స్ నియంత్రణ కోసం వినియోగించాలని నిర్ణయించామన్నారు. నాణ్యతతో కూడిన మద్యాన్ని క్వార్టర్ బాటిల్‌ను రూ.99కే విక్రయిస్తున్నామన్నారు. 81 కొత్త బ్రాండ్లు, 47 అంతర్జాతీయ బ్రాండ్ల మద్యం కూడా ప్రస్తుతం విక్రయించుకునేలా అనుమతులు ఇచ్చామన్నారు. ప్రొక్యూర్మెంట్ కూడా పారదర్శకంగా జరిగేలా కార్యాచరణ చేపట్టామని మంత్రి వివరించారు. గతంలో మద్యానికి సంబంధించిన అక్రమాలపై సీఐడీ విచారణ జరుగుతోందన్నారు.
'చీప్ లిక్కర్‌ను అన్ని చోట్లా పెడతాం - వైఎస్సార్సీపీ వాళ్లకూ మద్యం దుకాణాలు '
మందుబాబులకు గుడ్‌న్యూస్ - త్వరలో కొత్త బ్రాండ్లు, ధరల తగ్గింపు!