వైఎస్సార్సీపీ భూఅక్రమాలపై దర్యాప్తు జరిపిస్తాం: మంత్రి అనగాని - LANDS ISSUE IN ASSEMBLY
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 14, 2024, 4:32 PM IST
Minister Anagani on Lands issue in Assembly : వైఎస్సార్సీపీ హయాంలో ఫ్రీహోల్డ్ పేరుతో సాగించిన భూదురాక్రమణలపై దర్యాప్తు జరిపిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. అది సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలా? సభా సంఘం వేయాలా? అనేది పరిశీలిస్తున్నామని చెప్పారు. విశాఖతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ అక్రమాలు జరిగాయన్నారు. 6 లక్షల ఎకరాలకు పైగా భూముల అక్రమాలు జరిగినట్టుగా గుర్తించామని మంత్రి తెలిపారు. అలాగే అసైన్డ్ భూములకు సంబంధించిన 25 వేల ఎకరాల మేర రిజిస్ట్రేషన్ జరిగినట్టుగా గుర్తించామన్నారు. ప్రస్తుతం ఫ్రీ హోల్డ్ భూములకు రిజిస్ట్రేషన్లను నిలుపుదల చేసినట్టు మంత్రి తెలిపారు.
రాష్ట్రంలో భూ అక్రమాలపై విచారణ చేయించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా మంత్రికి సూచనలు చేశారు. జాప్యం లేకుండా విచారణ జరిపించాలని కోరారు. ఫ్రీహోల్డ్‌తోపాటు జగనన్న ఇళ్ల పట్టాలకు భూ సమీకరణ ముసుగులో కోట్ల విలువైన భూములను వైఎస్సార్సీపీ నేతలు కుట్రపూరితంగా కొల్లగొట్టారని టీడీపీ, జనసేన సభ్యులు ఆరోపించారు. మరోవైపు విశాఖలో జరిగిన భూ అక్రమాలపై విచారణ చేయించాలని మాజీ మంత్రి, టీడీపీ సభ్యుడు బండారు సత్యనారాయణ మూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.