Legal Advice on Domestic Violence Case : దేశంలో మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా వారిపై దౌర్జన్యాలు, గృహహింస వంటి సమస్యలు ఆగట్లేదు. ప్రస్తుత ఆధునిక యుగంలో కూడా చాలా మంది మహిళలు.. భర్త, అత్తమామల చేతిలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అయితే.. అత్తింటి వారి వేధింపులను భరించలేని ఓ మహిళ.. పుట్టింటికి వెళితే అక్కడ కూడా అండ దక్కలేదు. కన్న కూతురు బాధ పట్టని ఆ తండ్రి అత్తింటికి వెళ్లకపోతే.. కఠిన నిర్ణయం తీసుకుంటానని బెదిరిస్తున్నాడు. దీంతో.. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమె అత్తింటివారితోపాటు, తండ్రి మీద కూడా గృహహింస కేసు పెట్టడం సాధ్యమవుతుందా? అని న్యాయ నిపుణులు సలహా కోరుతున్నారు.
ఇదీ సమస్య..
'నాకు బావతో మ్యారేజ్ అయ్యింది. మేనత్త కూతుర్నే అయినా రోజూ నన్ను అనుమానంతో వేధించేవాడు. మందు తాగొచ్చి రోజూ కొడుతుండేవాడు. అత్తగారు మా అమ్మతో పోలుస్తూ చివాట్లు పెట్టేది. ఈ నరకం భరించలేక ప్రస్తుతం హైదరాబాద్ వచ్చి హాస్టల్‌లో ఉంటూ జాబ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సమస్య ఏంటంటే.. నేను కాపురానికి వెళ్లకపోతే నాన్న అమ్మకు విడాకులు ఇస్తానని బెదిరిస్తున్నాడు. వాళ్ల చెల్లికి, ఆమె కుమారుడికి అన్యాయం జరిగిందని గొడవ చేస్తున్నాడు. కానీ.. కన్న కూతురు బాధ ఏమాత్రం పట్టడం లేదు. నేను నా భర్తతో కలిసి జీవించాలని అనుకోవట్లేదు. అలాగని అమ్మని ఇబ్బందుల్లోకి నెట్టాలని నాకు లేదు. తను కూడా అత్తింట్లో ఎన్నో ఇబ్బందులను ఓర్చుకుంది. అయినా "నాకేమీ కాదు.. నీ ఫ్యూచర్ మాత్రమే చూసుకో" అంటోంది అమ్మ. ఇప్పుడు నేను అత్తింటి వారితోపాటు నాన్న పైనా గృహ హింస కేసు పెట్టే ఛాన్స్ ఉందా?' అని న్యాయ నిపుణుల సహాయం కోరుతోంది ఓ మహిళ . ఈ సమస్యకు ప్రముఖ న్యాయవాది 'జి. వరలక్ష్మి' ఎలాంటి ఆన్సర్ ఇచ్చారంటే..
అలుసు అవుతారు..
నేటికీ గృహహింస కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగించే అంశం. దాంతో డైవర్స్ కేసులు పెరుగుతున్నాయి. అయినవాళ్లు ప్రేమగా చూసుకుంటారన్న నమ్మకాలూ పోతున్నాయి. చెడు వ్యసనాలు, అలవాట్లు, పెంపకంలో లోపాలు ఆడవాళ్ల పాలిట శాపాలవుతున్నాయి. మీరు గృహహింస భరించలేక అత్తింట్లోంచి బయటికి వచ్చారు. ఇప్పుడు మీ తండ్రి మాటలకు భయపడి తిరిగి ఇంటికి వెళితే ఇంకా అలుసు అవుతారు.
"ఈ వయసులో మీ అమ్మగారిని వదిలేస్తే బాధపడాల్సింది మీ నాన్నే. వృద్ధాప్య దశలోనే మగవాళ్లకి ఆడవాళ్ల తోడు అధికంగా అవసరం ఉంటుంది. మీ అమ్మగారికి తన భర్త స్వభావం గురించి పూర్తిగా తెలుసు. అందుకే ఆవిడ భయపడకుండా ధైర్యంగా మీకు హామీ ఇస్తున్నారు." -జి. వరలక్ష్మి (ప్రముఖ న్యాయవాది)
మీరు అత్త, భర్తల మీదే కాదు.. కన్న తండ్రి మీదా గృహహింస కేసు పెట్టొచ్చు. గృహహింస చట్టంలోని సెక్షన్ 2 బాధిత వ్యక్తికి ప్రతివాదితో గృహ సంబంధం ఉంటే ఇది వర్తిస్తుంది అని తెలియజేస్తోంది. అంటే భార్య, భర్త, బావ, అత్త, మామ, కోడలు మాత్రమే కాదు తండ్రి, కొడుకు, కూతురు, సోదరి ఆఖరికి సహజీవనం చేస్తున్న, చట్టబద్ధత లేకున్నా రెండోపెళ్లి చేసుకున్న వ్యక్తులకు కూడా చట్టపరంగా రక్షణ కల్పిస్తోంది. అయితే.. ముందు పెద్ద మనుషులతో చెప్పించి చూడండి. అప్పటికీ మారకపోతే.. మీరు నిరభ్యంతరంగా మీ అత్తింటి వారిపైనే కాదు.. మీ తండ్రి మీద కూడా కేసు పెట్టొచ్చు. కానీ, ఈ చట్టంలో విడాకుల ప్రస్తావన లేదు. మీకు విడాకులు కావాలంటే విడిగా కేసు వేసుకోవాలి. కాబట్టి, ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
'నా భర్త మరణించాడు - ఆయన సంపాదించిన ఆ ఆస్తిలో మా పిల్లలకు వాటా ఉంటుందా?'
ఆడపిల్లలకు తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత ఉండదా? - న్యాయ నిపుణుల సమాధానమిదే!