Ramoji Foundation Donation to Indian School of Business : హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)కి రామోజీ ఫౌండేషన్ భారీ విరాళం ప్రకటించింది. ఐఎస్‌బీలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కార్పొరేట్ సామాజిక బాధ్యతగా ఆ నిధులను అందించింది. రామోజీ ఫౌండేషన్ ట్రస్టీ సీహెచ్ కిరణ్ రూ.30 కోట్ల విరాళం అందజేశారు. ఐఎస్‌బీకి కొత్తగా అందుబాటులోకి రానున్న ఎగ్జిక్యూటివ్ సెంటర్లో 430 సీట్ల సామర్థ్యంతో నిర్మించే అత్యాధునిక ఆడిటోరియం కోసం ఆ నిధులు ఖర్చు చేయనున్నారు. ఈ ఆడిటోరియం అందుబాటులోకి వస్తే ప్రాంగణంలో అంతర్జాతీయ సదస్సులు, పరిశోధనాత్మక సెమినార్లు, ప్రముఖుల ప్రసంగాలు, ఇతర ముఖ్య కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంది.
'దేశంలో అన్ని స్థాయిల్లో నాణ్యమైన విద్య లభించాలన్న ఫౌండేషన్ వ్యవస్థాపకులు స్వర్గీయ రామోజీరావు గౌరవార్థం, ఐఎస్‌బీలో ప్రపంచస్థాయి సదుపాయాలు కల్పించేందుకు ఈ సహాయం అందించాం. ఆధునిక సదుపాయాలతో ప్రపంచస్థాయి బిజినెస్ స్కూల్‌గా ఐఎస్‌బీ నిలుస్తుందని, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం' - సీహెచ్ కిరణ్, రామోజీ ఫౌండేషన్ ట్రస్టీ & రామోజీ గ్రూప్ సీఎండీ
కృతజ్ఞతలు తెలిపిన ఐఎస్‌బీ బోర్డు ఛైర్మన్ : అధ్యయనం, పరిశోధనలో ఐఎస్‌బీ ప్రపంచస్థాయి సంస్థగా ఎదగడంలో దాతలిచ్చిన విరాళాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని బోర్డు ఛైర్మన్ హరీశ్ మన్వానీ తెలిపారు. అత్యున్నత స్థాయి మౌలిక సదుపాయాలను నిలబెట్టుకునేందుకు రామోజీ ఫౌండేషన్ అందించిన సహకారం ఉపయోగపడుతుందన్న ఆయన, ఈ సందర్భంగా ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దాతల మద్దతు ఐఎస్‌బీ అభివృద్ధిలో గణనీయంగా సహాయపడుతోందని డీన్ మదన్ పిల్లుట్ల చెప్పారు. రామోజీ ఫౌండేషన్ అందించిన విరాళం బిజినెస్ స్కూల్లో ప్రపంచస్థాయి అభ్యాస అనుభవాలు పొందేందుకు సహకరిస్తుందని తెలిపారు.