Tamil Film Active Producers Association : యూట్యూబ్ ఛానల్స్, కొంతమంది నెటిజన్లు ఇచ్చే రివ్యూలు, చాలా సార్లు సినిమా ఫలితాలపై ప్రభావం చూపుతుంటాయి. అయితే ఇదే విషయాన్ని తాజాగా తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ పేర్కొంది. ఆ రివ్యూలను నియంత్రించేందుకు తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. రివ్యూలు పేరుతో నటీ నటులపై వ్యక్తిగత విమర్శలకు పాల్పడితే ఊరుకోమని కరాఖండిగా చెప్పింది. థియేటర్లలోకి మీడియాను అనుమతించవద్దని సినిమా హాలు యజమానులకు విజ్ఞప్తి చేసింది.
"ఈ సంవత్సరం రిలీజ్ అయిన చాలా సినిమాలపై రివ్యూలు ప్రభావం చూపాయి. ముఖ్యంగా కమల్ హాసన్ ఇండియన్ 2, రజనీ కాంత్ వేట్టయన్, సూర్య కంగువా సినిమాల రిజల్ట్‌పై పబ్లిక్ టాక్, యూట్యూబ్ ఛానల్స్ ఇచ్చే రివ్యూలు, విశ్లేషణలు చాలా ఎఫెక్ట్ చూపింది. రానురాను ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇదొక సమస్యగా మారుతోంది. అందుకే దీనిని కట్టడి చేసేందుకు ఫిల్మ్ ఇండస్ట్రీలోని అన్ని సంఘాలు ఏకం కావాల్సిన అవసరం ఉంది.
ఇండస్ట్రీ అభివృద్ధికి అందరూ కలిసి సమష్టిగా కృషి చేయాలి. ముఖ్యంగా ఇందులో భాగంగా థియేటర్ యజమానులు యూట్యూబ్ ఛానల్స్‌ను సినిమా థియేటర్ ప్రాంగణంలోకి అస్సలు అనుమతించకూడదు. మొదటి రోజు ఫస్ట్ షో సమయంలో థియేటర్ దగ్గర పబ్లిక్ రివ్యూలకు అవకాశం కల్పించకూడదు. అలాగే, రివ్యూల పేరుతో నటీ నటులు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్‌పై వ్యక్తిగత విమర్శలను కూడా మేము ఖండిస్తున్నాం. ఇకపై అలాంటి వాటికి పాల్పడితే అస్సలు అంగీకరించేది లేదు" అని పేర్కొంది.
కాగా, ఈ ఏడాది రీసెంట్గా భారీ అంచనాలతో వచ్చిన ఇండియన్ 2, వేట్టాయన్, కంగువా మొదటి షో నుంచే నెగటివ్ టాక్‌ను తెచ్చుకున్నాయి. స్టార్ హీరోల సినిమాలు అయినప్పటికీ బాక్సాఫీస్ ముందు కలెక్షన్స్ పరంగానూ నిరాశ పరిచాయి. సోషల్ మీడియాలో ఈ చిత్రాల రివ్యూలను పోస్ట్ చేస్తూ చాలా మంది తెగ ట్రోల్ కూడా చేశారు. ముఖ్యంగా ఇండియన్ 2 అయితే విపరీతంగా విమర్శలు చేశారు.
చైనాలో రిలీజ్‌కు సిద్ధమైన విజయ్ సేతుపతి సినిమా - ఏకంగా 40 వేల థియేటర్లలో!