NTPC Investments in AP : ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో పునరుత్పాదక రంగంలో ప్రాజెక్టులు పెట్టేందుకు సిద్ధమైంది. 1,87,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. వచ్చే 25 ఏళ్లలో రాష్ట్రానికి 20,620 కోట్ల ఆదాయం రానుంది. 1 లక్షా 6 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామి చేసే క్రమంలో ఇదో కీలక అడుగుగా ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు.
రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ రంగానికి మహర్దశ ప్రారంభమైంది. మహారత్నలో ఒక్కటైన ఎన్టీపీసీ సంస్థ తన ‘ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్’ ఆధ్వర్యాన ఈ రంగంలో భారీ పెట్టుబుడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి గొట్టిపాటి రవి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఎన్‌ఆర్ఈడీసీఏపీ) - ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఎన్జీఈఎల్) మధ్య ఒప్పందం జరిగింది.
ఈ ఒప్పందం అమలులోకి రావడం ద్వారా రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు నెలకొల్పేందుకు 1,87,000 కోట్ల పెట్టుబడి ఎన్జీఈఎల్ పెట్టనుంది. దీని ద్వారా దాదాపు రాష్ట్రంలో 1,06,250 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. అలాగే రానున్న 25 సంవత్సరాల కాలంలో దాదాపు 20,620 కోట్ల లబ్ది రాష్ట్రానికి వివిధ రూపాల్లో చేకూరనుంది.
సౌర, పవన, పంప్డ్ స్టోరేజీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా వంటి పునరుత్పాదక విద్యుత్ రంగ ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. భవిష్యత్ అంతా పునరుత్పాదక విద్యుత్ రంగానిదేనని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ఫస్ట్ ఫేజ్ ను 2027 ఏప్రిల్ మే నాటికి పూర్తి చెయ్యాలని సీఎం తెలిపారు.
కాలుష్య రహిత ఇంధన వనరుల ఉత్పత్తికి కృషి చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి తమ సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా వచ్చే ఐదేళ్లలో 78.50 గిగావాట్ల సౌరశక్తి, 35 గిగావాట్ల పవన శక్తి, 22 గిగావాట్ల పంప్డ్ స్టోరేజీ, 1.50 ఎంఎంటీపీఏ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ఈ లక్ష్యంతో రాష్ట్ర ఇంధన మౌలిక అవసరాలు తీరడమే కాకుండా, రాష్ట్రానికి భారీగా ఆదాయం సమకూరుతుందన్నారు. పునరుత్పాదక ఇంధన రంగం విషయంలో ఎంతో నిబద్ధతతో, ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామని, ఈ విషయంలో దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని నిలుపుతామని తేల్చి చెప్పారు.
ఎన్జీఈఎల్ – ఎన్‌ఆర్ఈడీసీఏపీ సంయుక్త భాగస్వామ్యంతో 25 గిగావాట్ల సామర్ధ్యం వున్న సౌర, పవన, హైబ్రిడ్ సిస్టమ్‌ల ఇంధన ప్రాజెక్టులు అభివృద్ధి చేయాలని ఎన్టీపీసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ మిథనాల్ వంటి ఉత్పన్నాలను తగిన పద్ధతుల ద్వారా 0.5 MMTPA(మిలియన్ మెట్రిక్ టన్ పర్ యానం) ఉత్పత్తి చేయడంపై దృష్టి సారిస్తుంది. అదనంగా, రాష్ట్రంలోని అనువైన ప్రదేశాలలో 10 గిగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ హైడ్రో ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. ఈ జాయింట్ వెంచర్‌తో పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు రావడమే కాకుండా, ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాల రూపురేఖలు మారతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
రాష్ట్రంలో ఎన్‌టీపీసీ భారీ పెట్టుబడులపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. నూతన ఐసీఈ విధానాలు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయన్నారు. ఏపీ క్లీన్ ఎనర్జీ హబ్‌గా ఎదిగేందుకు మార్గం సుగమైందని ఎక్స్‌లో పేర్కొన్నారు. ఎన్‌టీపీసీ పెట్టుబడుల వల్ల లక్షకు పైగా ఉద్యోగాలు వస్తాయని సీఎం చంద్రబాబు తెలిపారు.
The new ICE Policy 2024 continues to attract investments and pave the way for Andhra Pradesh to emerge as a clean energy hub. Today, NTPC Green Energy Ltd. signed a Joint Venture with NREDCAP to set up RE projects worth ₹2,00,000 Cr in Andhra Pradesh. The focus will be on 25 GW… pic.twitter.com/5nznM2DtPo
— N Chandrababu Naidu (@ncbn) November 21, 2024
రీస్టార్ట్ ఏపీ - 85 వేల కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్
రాష్ట్రంలో రిలయన్స్ రూ.65 వేల కోట్ల పెట్టుబడి - సీఎం చంద్రబాబు సమక్షంలో ఎంవోయూ