కూల్‌గా వస్తారు దర్జాగా దోచేస్తారు - ఈ డీజిల్ దొంగల కథే వేరు - Diesel Thieves at palnadu - DIESEL THIEVES AT PALNADU
Published : Aug 5, 2024, 2:54 PM IST
Diesel Thieves At Rompicherla HighWay in Palnadu District : ఏపీలోని పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలంలో డీజిల్ చోరీ ముఠా రెచ్చిపోతుంది. కారులో దర్జాగా వచ్చి ఆగివున్న లారీలలో అర్ధరాత్రి డీజిల్ దొంగతనం చేస్తున్నారు. అద్దంకి నుంచి నార్కెట్ పల్లి హైవేపై రొంపిచర్ల పెట్రోల్ బంకు వద్ద అర్ధరాత్రి చోరీల సంఖ్య పెరిగిపోతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. లారీ డ్రైవర్లు అలసిపోయి నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి లారీల నుంచి డీజిల్‌ని కొందరు నిందితులు దొంగిలిస్తున్నట్లు డ్రైవర్లు పేర్కొన్నారు.
తెల్లవారేసరికి డీజిల్ తగ్గిపోతుండటంతో లారీ డ్రైవర్లు లబోదిబోమంటున్నారు. దగ్గర్లోని పెట్రోల్‌బంక్ వద్ద ఆయిల్ చోరీ ముఠా కదలికలు సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. రొంపిచర్ల పోలీసులు ఆయిల్ చోరీలపై దృష్టి సారించి నిందితులను పట్టుకుని చోరీలను అరికట్టాలని డ్రైవర్లు వేడుకున్నారు. తరచూ జరుగుతున్న దొంగతనాలలో కొన్ని సార్లు వారి ఫోన్లను సైతం దుండగులు ఎత్తుకుపోతున్నారని బాధితులు వాపోయారు. జాతీయ రహదారులపై అర్థరాత్రి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా నుంచి తమను రక్షించాలని కోరారు.