పంట పొలంలో మొసలిని చూసి రైతుల హడల్ - వీడియో వైరల్ - Crocodile In Farmland
Published : Feb 29, 2024, 10:14 AM IST
Crocodile in Nalgonda : మొసళ్లను మనం సహజంగా సరస్సులు, నదుల్లో మాత్రమే చూస్తుంటాం. అప్పుడప్పుడు భారీ వరదల సమయాల్లోనూ బయటపడుతుంటాయి. అలాంటి మొసలి పంట పొలాల్లో కనిపిస్తే ఎవ్వరైనా జంకాల్సిందే. నల్గొండ జిల్లాలో ఇలాంటి ఘటనే ఎదురైంది. త్రిపురాపురం మండల కేంద్రంలో దేవుని మాన్యం వ్యవసాయ పొలాల్లో మొసలి ప్రత్యక్షమైంది. గ్రామానికి చెందిన నాగయ్య అనే రైతు వరి పొలంలో మొసలి వచ్చి చేరింది. పనుల కోసం పంట దగ్గరకు వెళ్లిన రైతులకు అక్కడ పొలంలో మొసలి కనిపించింది. గ్రామస్థులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
Crocodile In Farmland : పంట పొలాల్లో మొసలి విహారం గురించి సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఆ గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్థుల సహాయంతో అధికారులు చేనులో ఉన్న మొసలిని తాడుతో బంధించి వాహనంలో దానిని ఎక్కించి సమీపంలోని నీటిలో వదిలారు. గ్రామంలోకి మొసలి వచ్చిందంటే ఎవరికైనా ఒకింత ఆసక్తే కదా. అందుకే ఆ గ్రామంలోని ప్రజలందరూ మొసలిని వీక్షించడానికి పొలం వద్దకు తరలివచ్చారు.