మహిళల వేషధారణలో పురుషులు- అమ్మవారికి ప్రత్యేక పూజలు - Chamayavilakku festival kerala
Published : Mar 24, 2024, 3:45 PM IST
Chamayavilakku Festival 2024 : కేరళ కొల్లాం జిల్లాలో చమయవిళక్కు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వందలాది మంది పురుషులు, మహిళ వేషధారణలో, శ్రీ కొట్టంకులంగర దుర్గ భగవతి ఆలయంలో దీపార్చన చేశారు. తమ కోరికలు నెరవేరడానికి పురుషులు, మహిళల వేషధారణలో వచ్చి ఇక్కడ పూజలు చేయడం సంప్రదాయంగా భావిస్తారు. ఈ ఉత్సవాల్లోట్రాన్స్జెండర్లు కూడా భారీగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండు రోజుల పాటు జరిగే చమయవిళక్కు ఉత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఆదివారం ముగియనున్నాయి. ఈ ఉత్సవాలు ప్రతి ఏటా మలయాళీ నెల 'మీనం' 10, 11వ తేదీల్లో జరుపుకుంటారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో పురుషులు, మహిళల వేషధారణలో వచ్చి ఐదు ఒత్తులు కలిగిన ప్రత్యేక దీపాలు వెలిగించి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఈ వేడుకల్లో ప్రతిరోజు అర్ధరాత్రి వరకు పూజలు నిర్వహిస్తారు.
ఇదీ కథ
ఓ రోజు కొందరు పిల్లలు ఆవులు మేపడానికి అడవికి వెళ్లారు. అక్కడ వారికి ఒక కొబ్బరికాయ కనిపించింది. వెంటనే దాన్ని తీసుకుని బండ రాయితో పగలగొట్టే ప్రయత్నం చేశారు. అకస్మాత్తుగా రాయిలోంచి రక్తం కారింది. దీంతో ఆ పిల్లలు భయపడి, వాళ్ల తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పారు. అనంతరం వారు జ్యోతిషులను సంప్రదించారు. ఆ రాయిలో 'వనదుర్గ' శక్తి దాగుందని వెంటనే అక్కడ ఆలయం నిర్మించాలని జ్యోతిషులు చెప్పారు. దీంతో స్థానికులు గుడి కట్టి ఏటా ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మరో కథ ప్రకారం, ఒకప్పుడు ఆవులు మేపుకునే కొంతమంది వ్యక్తులు, మహిళల వేషధారణలో ఓ బండరాయికి పుష్పార్చన చేసేవారు. అప్పటినుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది.