50 అడుగుల ఎత్తు నుంచి దూకుతున్న వరద పరవళ్లు - బొగత అందాలు చూడతరమా? - Bogatha Waterfall in Mulugu - BOGATHA WATERFALL IN MULUGU
Published : Jul 28, 2024, 10:36 AM IST
Bogatha Waterfall at Mulugu District : ఛత్తీస్గఢ్, తెలంగాణ అటవీ ప్రాంతంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు బొగత జలపాతం వద్ద జలకళ సంతరించుకుంది. దట్టమైన పామునూరు అటవీ ప్రాంతం నుంచి కొండ కోనల నడుమ వర్షపు నీరు జాలువారుతోంది. వాగులు, వంకలు దాటి బొగత జలపాతం పొంగిపొర్లుతోంది. ఆ వరద నీరు 50 ఫీట్ల ఎత్తు నుంచి కిందకు దూకుతూ నయాగరా జలపాతాన్ని తలపిస్తోంది. ప్రస్తుతం అక్కడ నీటి ప్రవాహం ఉద్ధృతంగా సాగుతోంది. అలా బొగత జలపాతం నుంచి వరద నీరు గోదావరి నదిలో కలిసిపోతుంది. ఇలాంటి సుందర దృశ్యాలను చూడటానికి రాష్ట్ర నలుమూల నుంచి పర్యాటకులు వెళ్తుంటారు. అయితే ప్రస్తుతం బొగత జలపాతం వద్ద సందర్శకులను అనుమతించడం లేదు. భారీగా వరద ఉద్ధృతి వస్తున్నందున ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున అధికారులు అనుమతి నిరాకరించారు. ఎవరైనా నిబంధనలు బేఖాతరు చేసి వెళ్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. వరద ప్రవాహం తగ్గిన తర్వాత పర్యాటకులకు జలపాతాన్ని సందర్శించే అవకాశం కల్పిస్తామని చెప్పారు.