ఎంపీగా గెలిచినందుకు మందు పార్టీ- ఫ్రీ బాటిల్స్ కోసం జనం క్యూ - BJP MP Alcohol Party - BJP MP ALCOHOL PARTY
Published : Jul 8, 2024, 5:00 PM IST
BJP MP Alcohol Party In Karnataka : లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఓ బీజేపీ ఎంపీ కార్యకర్తలకు మందు పార్టీని ఏర్పాటు చేశారు. మద్యం బాటిళ్ల కోసం కార్యకర్తలతో సహా ప్రజలు ఎగబడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కె సుధాకర్ కర్ణాటకలోని చిక్కబళ్లాపుర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు. పార్టీ గెలుపునకు కృషి చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆదివారం సాయంత్రం నేలమంగళలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో ఆహారంతో పాటు మద్యం కూడా పంపణీ చేశారు. దీంతో ఉచిత మద్యం బాటిళ్ల కోసం ప్రజలు ఎగబడ్డారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ మందు పంపిణీకి ఎక్సైజ్ శాఖ అనుమతి ఇచ్చినట్లు బెంగళూరు రూరల్ ఎస్పీ సీకే బాబా తెలిపారు. ఈ విషయంలో తమ తప్పులేదని, ఎక్సైజ్ శాఖ అనుమతి ఇవ్వడం వల్లే ఈ కార్యక్రమానికి భద్రత ఏర్పాట్లు చూసుకోవాలని పోలీసులకు ఆదేశించినట్లు ఎస్పీ స్పష్టం చేశారు.