ప్రాణం తీసిన పందెం - టపాసుల బాక్స్ పేలి యువకుడు మృతి - వీడియో వైరల్! - MAN DIES AFTER FIRECRACKER EXPLODES
Published : Nov 4, 2024, 7:59 PM IST
Youth Dies After Sitting On Firecracker Box : అతి సర్వత్రా వర్జయేత్ అనే విషయాన్ని నిజం చేస్తూ, బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. 32 ఏళ్ల శబరీష్ అనే వ్యక్తి తోటివారితో పందెం కాసి టపాసుల బాక్స్‌పై కూర్చుని ప్రాణాలు పోగొట్టుకున్నాడు. దీపావళి రోజున ఫూటుగా తాగిన మందు బాబులు, టపాసులు కాల్చేందుకు రోడ్డు పైకి వచ్చారు. ఈ క్రమంలోనే టపాసుల బాక్స్‌పై కూర్చోవాలని శబరీష్‌కు స్నేహితులు పందెం విసిరారు. వారి ఛాలెంజ్‌ను స్వీకరించిన శబరీష్ ఆ పెట్టెపై కూర్చున్నాడు. టపాసుల బాక్స్‌కు నిప్పు అంటి స్నేహతులు దూరంగా వెళ్లిపోయారు. కానీ బాంబు భారీ శబ్దంతో పేలింది. దీంతో ఒక్కసారిగా పెట్టెపై నుంచి శబరీష్ ఎగిరిపడ్డాడు. ఒక్క క్షణం కూర్చోని చుట్టూ చూసిన శబరీష్ మరుక్షణం నేలపైవాలిపోయాడు. ఆసుపత్రికి తరలించినప్పటికీ అతని ప్రాణాలు మాత్రం దక్కలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, పందెం కాసిన ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పేలుడు ధాటికి అంతర్గత అవయవాలు దెబ్బతినడం వల్లనే శబరీష్ ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని పోలీసులు తెలిపారు.