రన్నింగ్ ట్రైన్ ఎక్కబోతుండగా ప్రమాదం - రెప్పపాటులో రక్షించిన రైల్వే పోలీస్ - railway cop saved the life - RAILWAY COP SAVED THE LIFE
Published : Jul 25, 2024, 5:07 PM IST
Railway Cop Saved the Life : కొన్ని కొన్ని ప్రమాదాలు రెప్పపాటులోనే జరిగిపోతుంటాయి. ఆరెరె ఒక్క క్షణం ఆలస్యమైతే ప్రాణాలు ఉండేవేమోనని సానుభూతి చూపుతుంటాము. సరిగ్గా అటువంటి ప్రమాదం నుంచి బయటపడి ప్రాణాలతో ఉన్నారంటే సదరు వ్యక్తికి పునర్జన్మ ఎత్తాడని చెప్పాలి. ఈ వీడియోను చూస్తే మీరు కూడా ఈ అభిప్రాయానికే వస్తారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే.. వికారాబాద్ రైల్వే స్టేషన్‌లో రైలు ఆగింది. ప్రయాణికుడు ఏక్‌నాథ్ కుమ్లే రైలు దిగి స్టేషన్‌లోకి వెళ్లాడు. కాసేపటికి రైలు ప్రారంభం కావడంతో ప్రయాణికుడు హుటాహుటిన కదులుతున్న రైలు ఎక్కే ప్రయత్నం చేశాడు. అనుకోకుండా మెట్లపై కాలు జారింది. ఇంతలోనే రైలు కింద పట్టాలపై పడబోయాడు. అక్కడే ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సరైన సమయంలో స్పందించి తనని వెనక్కిలాగాడు. ఈ ప్రమాదంలో ప్రయాణికుడు ఏక్‌నాథ్ కుమ్లే క్షేమంగా బయటపడ్డాడు. సకాలంలో స్పందించి ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్‌ను అక్కడి ప్రయాణికులు అభినందించారు.