పాఠశాల అభివృద్ధికి నిధుల కోసం యోగా- నాన్‌స్టాప్‌గా 25గంటలు! - Yoga Class For School Funds
Published : Sep 11, 2024, 5:26 PM IST
Yoga Class For School Development Funds : కర్ణాటకలోని మంగళూరుకు చెందిన ఓ వ్యక్తి నిరంతరాయంగా 25 గంటలపాటు యోగా శిక్షణా తరగతులు నిర్వహించారు. దీంతో గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్నారు. అయితే ఆయన 25 గంటలపాటు యోగా క్లాస్ చెప్పింది రికార్డు కోసం కాదు! ఓ మంచి పని కోసం. అదేంటంటే?
యోగా గురువు కుశలప్ప గౌడ తాను చదువుకున్న బెల్తంగడిలోని మొగ్రు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి నిధులు సేకరించాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకు గాను జులై 22,23వ తేదీల్లో మంగళూరులోని యెనపోయ మెడికల్ కాలేజ్ ఇన్‌స్టిట్యూట్‌లో 25 గంటల 4 నిమిషాల 35 సెకన్ల పాటు యోగా తరగతులు నిర్వహించారు. ఆ కార్యక్రమంలో 2,693 వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
అయితే యోగా మారథాన్ క్లాస్‌కు వచ్చిన గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సిబ్బంది రెండు రికార్డులను నమోదు చేశారు. కుశలప్ప గౌడను సత్కరించారు. అదే సమయంలో యోగా తరగతుల ద్వారా సేకరించిన రూ.2లక్షలను కుశలప్ప గౌడ మొగ్రు ప్రభుత్వ పాఠశాలకు అందజేశారు. దీని ద్వారా పాఠశాల అభివృద్ధికి దోహదపడ్డారు.