YouTube Auto Dubbing Feature:కంటెంట్ క్రియేటర్లకు గుడ్‌న్యూస్. ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ ఏఐ ద్వారా పనిచేసే సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీనిసాయంతో ఇకపై సినిమాలే కాదు, భాష రాకపోయినా ఇకపై యూట్యూబ్ వీడియోలను ఖండాంతరాలను దాటించొచ్చు. అంటే మీ యూట్యూబ్ ఛానెల్లోని కంటెంట్‌ను విదేశాల్లోని వారికీ తమ భాషల్లో వినిపించొచ్చు.
ఇందుకోసం మీకు ఆ భాష రావాల్సిన పనిలేదు. యూట్యూబ్ 'ఆటో డబ్బింగ్' పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్.. మీ వీడియోల్లోని వాయిస్‌ను ఆటోమేటిక్‌గా డబ్ చేసి వేర్వేరు భాషల్లోకి ట్రాన్స్‌లేట్ చేసి వినిపిస్తుంది. దీంతో కంటెంట్ క్రియేటర్లు ఇకపై ఎలాంటి ఇబ్బందులూ లేకుండా తమ వీడియోను ఇతర భాషల్లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ స్లైడ్స్, వీడియో బిట్స్‌తో కంటెంట్ ఇచ్చేవారికి మరింత ఉపయోగపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ ఫీచర్‌ను ఉపయోగించడం ఎలా?:
- ఇందుకోసం యూట్యూబ్‌లోని మీ ఛానెల్లో ఎప్పటిలాగే మీ వీడియోలను అప్‌లోడ్ చేయండి. యూట్యూబ్ ఈ ఆటో డబ్బింగ్ ఫీచర్ సహాయంతో భాషను గుర్తించి, అది సపోర్ట్ చేసే ఇతర భాషల్లోకి ఆటోమేటిక్‌గా వీడియోలోని వాయిస్‌ను డబ్ చేస్తుంది.
- ఆ తర్వాత మీ డబ్బింగ్ వీడియోలను చూసేందుకు 'YouTube Studio'లోని 'Languages' సెక్షన్‌కు వెళ్లండి. అందులో ఇతర భాషల్లోకి డబ్ అయిన మీ వీడియోలు ఉంటాయి. అవి మీకు నచ్చకపోతే వాటిని అన్పబ్లిష్ లేదా డిలీట్ చేసేయొచ్చు.
- అంతేకాక డబ్ అయిన కంటెంట్‌ను ఫైనల్‌గా అప్లోడ్ చేయడానికి ముందు రివ్యూ కూడా చేసుకోవచ్చు.
ఏ భాషలోకి అయినా మార్చుకోవచ్చా?:
- యూట్యూబ్ ప్రాథమికంగా ఈ ఫీచర్‌ను ఇంగ్లిష్‌లోని వీడియో కంటెంట్‌ను ఫ్రెంచ్, జర్మన్, హిందీ, ఇండోనేషియన్, ఇటాలియన్, జపనీస్, పోర్చుగీస్, స్పానిష్ భాషల్లోకి ఆటోమేటిక్‌గా డబ్ చేసేలా తీసుకొచ్చింది.
- వీడియోలోని వాయిస్ పైన తెలిపిన ఏ లాంగ్వెజ్‌లో ఉన్నా అది ముందుగా ఇంగ్లిష్‌లోకి మారిపోతుంది.
- ఉదాహరణకు మీరు హిందీలో వీడియోను క్రియేట్ చేస్తే అది ఆటోమేటిక్‌గా ఇంగ్లిష్‌లోకి మారిపోతుంది.
- ఇలా ఆడియో డబ్ చేసిన వీడియోలపై 'auto-dubbed' అనే లేబుల్ యూజర్లకు కన్పిస్తుంది.
- ఒకవేళ వినియోదారులకు యూట్యూబ్ ఏఐ డబ్ చేసిన వాయిస్ వద్దనుకుంటే 'track selector' ఆప్షన్ ఉపయోగించి ఒరిజినల్ వాయిస్‌ను వినొచ్చు.
- యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేటర్లు ఏ లాంగ్వెజ్లోకి డబ్ చేసేందుకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారో ఈ ప్లాట్‌ఫారమ్ నోట్ చేసుకుంటుంది.
- అయితే ఈ ఫీచర్ కొన్ని సందర్భాల్లో పనిచేయదని యూట్యూబ్ స్పష్టం చేసింది.