Biden Clemency : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ క్షమాభిక్షలు, శిక్ష తగ్గింపుల్లో దూకుడు కనబరుస్తున్నారు. పదవీ కాలం ముగుస్తున్న వేళ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గురువారం ఒక్కరోజే దాదాపు 1500 మంది ఖైదీలకు శిక్ష తగ్గించారు. 39 మందికి క్షమాభిక్ష ప్రసాదించారు. అమెరికా చరిత్రలో ఒకేరోజు ఈ స్థాయిలో క్షమాభిక్షలు కల్పించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
కరోనా వైరస్ విజృంభణ సమయంలో అనేక మంది ఖైదీలను అమెరికా ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేసింది. జైళ్లలో కొవిడ్ వైరస్ వ్యాప్తి చెందకుండా అప్పుడు చర్యలు చేపట్టింది. అప్పటికే ప్రతి ఐదుగురు ఖైదీల్లో ఒకరికి కొవిడ్ ఉన్నట్లు అంచనా వేసింది. అయితే జైలు నుంచి విడుదలైన తర్వాత కనీసం ఏడాది పాటు గృహ నిర్బంధంలో ఉన్న వారికి బైడెన్ శిక్ష తగ్గించాలని నిర్ణయించారు. అందులో భాగంగా గురువారం నాడు అనేక మందికి శిక్ష తగ్గించారు.
వారే ఎక్కువ!
రాబోయే రోజుల్లో మరింత మందికి శిక్షలు తగ్గించి, క్షమాభిక్ష పిటిషన్లను కూడా పరిశీలిస్తానని జో బైడెన్ తెలిపారు. గతంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన పదవీకాలం ముగిసే సమయంలో ఒకేరోజు 330 మంది ఖైదీలకు శిక్ష తగ్గించారు. ఇప్పటివరకు అదే అత్యధికం. ఇప్పుడు బైడెన్ శిక్ష తగ్గించిన వారిలో డ్రగ్స్ కేసులో శిక్ష అనుభవిస్తున్న వారితో పాటు స్వలింగ సంపర్కం నిబంధనలు ఉల్లంఘించిన వారే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.
మరోవైపు, అక్రమ ఆయుధ కొనుగోళ్ల కేసులో దోషిగా తేలిన తన కుమారుడు హంటర్ బైడెన్‌కు జో బైడెన్ ఇటీవల క్షమాభిక్ష ప్రసాదిస్తూ సంచలన నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. ఆ తర్వాత నుంచి మరణశిక్ష ఎదుర్కొంటున్న వారితో పాటు అనేకమంది ఖైదీలకు శిక్ష తగ్గింపు లేదా క్షమాభిక్షల కోసం బైడెన్‌పై ఒత్తిడి పెరుగుతోంది. అదే సమయంలో 2020 అధ్యక్ష ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల్లో పాల్గొన్న వారికి శిక్ష తగ్గించాలా వద్దా అన్న విషయంపై బైడెన్ తీవ్రమైన ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.