Online Data Protection Tips : ఇది ఇంటర్నెట్ యుగం. ఇంటర్నెట్ వల్లే డిజిటల్ విప్లవానికి బాటలు పడ్డాయి. ఇప్పుడు నెటిజన్లు ఆన్‌లైన్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇంటర్నెట్ బ్రౌజింగ్ గురించి తెలిసిపోయింది. ప్రత్యేకించి సోషల్ మీడియా వినియోగానికి చాలామంది అలవాటుపడ్డారు. ఉదయం నుంచి రాత్రి దాకా ఏదో ఒక సమయంలో యూట్యూబ్ తప్పకుండా చూస్తున్నారు. ఈ తరుణంలో మన బ్రౌజింగ్ సమాచారం ఆయా యాప్‌లు, బ్రౌజర్లలో నిక్షిప్తమై ఉంటుంది. దాన్ని రక్షించుకోవడం ఎలా? 2025 సంవత్సరంలో ఇందుకోసం పాటించదగిన 10 చిట్కాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
ఆన్‌లైన్ సమాచారాన్ని ఏం చేస్తారు ?
మన బ్రౌజింగ్ సమాచారాన్ని తప్పకుండా రక్షించుకోవాలి. లేదంటే దాన్ని దుర్వినియోగం చేసే ముప్పు ఉంటుంది. కొన్ని సంస్థలు మన ఆన్‌లైన్ బ్రౌజింగ్ సమాచారం ఆధారంగా మనకు యాడ్స్ (ప్రకటనలు) చూపిస్తాయి. ఇంకొన్ని సంస్థలు మన ఆసక్తిని గుర్తించి దానికి అనుగుణమైన ప్రకటనలు, కంటెంట్‌ను మనకు సిఫారసు చేస్తాయి. మరికొన్ని సంస్థలు మన వ్యక్తిగత బ్రౌజింగ్ సమాచారాన్ని కూడగట్టి ఇతరత్రా థర్డ్ పార్టీ సంస్థలకు అమ్మేస్తుంటాయి. అలాంటి గుర్తు తెలియని సంస్థలు తప్పుడు ఉద్దేశాల కోసం మన ఆన్‌లైన్ సమాచారాన్ని దుర్వినియోగం చేసే ముప్పు ఉంటుంది. ఇంతకీ మనం వాడే బ్రౌజర్లు, వెబ్‌సైట్లు, యాప్‌లలోకి ఈ సమాచారం ఎలా చేరుతుంది.. అనుకుంటున్నారా ? మరేం లేదు. మనం వివిధ బ్రౌజర్లు, వెబ్‌సైట్లు, యాప్‌లను వినియోగించే క్రమంలో ''షరతులకు అంగీకరించు''(accept) అనే ఆప్షన్ డిస్‌ప్లే అవుతుంటుంది. అక్కడ మనం అంగీకరించు(accept) బటన్‌పై క్లిక్ చేస్తుంటాం. మన బ్రౌజింగ్ సమాచారాన్ని వాళ్లకు ఇచ్చేందుకు అభ్యంతరం లేదని చెప్పామన్న మాట. ఇక మనం వ్యక్తిగత ఆన్‌లైన్ సమాచారాన్ని రక్షించుకునే చిట్కాల చిట్టా చూద్దాం.
1. అనానిమస్ మోడ్‌లో బ్రౌజ్ చేయండి
గూగుల్ క్రోమ్, ఫైర్ ఫాక్స్, సఫారీ ఇలా ఏ ఇంటర్నెట్ బ్రౌజర్ అయినా సరే మనం అనానిమస్ మోడ్(Anonymous Mode)లో వినియోగించాలి. ప్రైవేట్ మోడ్‌లో వినియోగిస్తే మన బ్రౌజింగ్ సమాచారానికి రక్షణ లభిస్తుంది. తద్వారా మనం చూసే వెబ్‌సైట్ల కుకీలు బ్లాక్ అవుతాయి. ఫలితంగా మన వెబ్ బ్రౌజింగ్ హిస్టరీని ట్రాక్ చేయడం కుదరదు. మన బ్రౌజింగ్ సమాచారాన్ని కుకీలు నిక్షిప్తం చేస్తాయి. వాటిలోని సమాచారం ఆధారంగానే మనకు ఇంటర్నెట్‌లో ప్రకటనలను, కంటెంట్‌ను చూపిస్తుంటారు. అనానిమస్ మోడ్‌లో ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తే కుకీల ట్రాకింగ్ బెడద ఉండదు.
2. ప్రైవసీని కాపాడే సెర్చింజన్‌కు మారిపోండి
మీరు నిత్యం వినియోగించే ఇంటర్నెట్ సెర్చింజన్‌కు ఆదాయం ఎలా వస్తోందని ఎప్పుడైనా ఆలోచించారా ? మరేం లేదు.. మీ ఇంటర్నెట్ బ్రౌజింగ్ యాక్టివిటీ ఆధారంగా మీకు తగిన ప్రకటనలను చూపించి గూగుల్ లాంటి ఇంటర్నెట్ సెర్చింజన్‌లు డబ్బులు సంపాదిస్తాయి. మీకు ఆసక్తి ఉన్న అంశాలేవి ? మీరు ఏయే అంశాలపై ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తున్నారు ? అనేది సెర్చింజన్‌కు బాగా తెలుసు. అందుకే దానికి అనుగుణంగా మీ ఎదుటకు కంటెంట్, యాడ్స్‌ను పంపుతుంది. కేవలం విరాళాల ద్వారా నడిచే కొన్ని ఇంటర్నెట్ సెర్చింజన్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిని వినియోగిస్తే మీ ప్రైవసీ(గోప్యత)కు చాలా సేఫ్టీ లభిస్తుంది. DuckDuckGo , Qwant, Startpage వంటివి మీరు పరిశీలించదగిన ఇంటర్నెట్ సెర్చింజన్‌లు.
3. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్‌లనే ఉపయోగించండి
మెసేజింగ్ యాప్‌ల వినియోగంలో కనీస జాగ్రత్తలు పాటించండి. కొన్ని యాప్‌లు మాత్రమే సేఫ్ అని తెలుసుకోండి. వాట్సాప్, సిగ్నల్, టెలిగ్రామ్ వంటి యాప్‌ల ద్వారా పంపే మెసేజ్‌లు ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్‌గా ఉంటాయి. అందుకే ఈ యాప్స్ సేఫ్. కొన్ని మోసపూరిత మెసేజింగ్ యాప్‌లు ఉంటాయి. అవి మీ మెసేజ్‌లను చదివేస్తాయి. వాటిని మార్కెటింగ్ కంపెనీలకు అమ్మేస్తాయి. అలాంటి వాటితో జాగ్రత్త.
4. వీపీఎన్‌ను ఉపయోగించండి
చాలామంది ఇళ్లలో వైఫై కనెక్షన్లు ఉంటాయి. దాని ద్వారా బ్రౌజింగ్ సేఫ్ అని చాలా మంది భావిస్తుంటారు. వాస్తవానికి వైఫై కనెక్షన్ ఇచ్చిన సంస్థ మీ ఇంటర్నెట్ బ్రౌజింగ్ చరిత్రను నిక్షిప్తం చేస్తుంది. అది తలచుకుంటే దాన్ని థర్డ్ పార్టీకి విక్రయించగలదు. మనదేశంలో డేటా రక్షణ చట్టాలు ఇంకా కఠినతరం కాలేదు. అందువల్ల మన ఆన్‌లైన్ బ్రౌజింగ్ చిట్టాకు గండం ఉంది. ఈ ముప్పు నుంచి గట్టెక్కేందుకు మనం వీపీఎన్ (VPN)ను వినియోగించాలి. వీపీఎన్ అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్. ఇది మన కోసం ప్రైవేట్ నెట్‌వర్క్‌ను క్రియేట్ చేస్తుంది. వీపీఎన్ ద్వారా మనం చూసే కంటెంట్, బ్రౌజ్ చేసే సైట్ల సమాచారాన్ని థర్డ్ పార్టీ ట్రాక్ చేయలేదు. ExpressVPN, NordVPN, హాట్‌స్పాట్ షీల్డ్, IPVanish వంటి వీపీఎన్ నెట్‌వర్క్‌లను ఎక్కువగా వినియోగిస్తుంటారు.
5. ఈ ఎక్స్‌టెన్షన్లతో బ్రౌజర్ సేఫ్
మనం కొన్ని ఎక్స్‌టెన్షన్లు, ఆన్‌లైన్ సెక్యూరిటీ టూల్స్ ద్వారా మన ఆన్‌లైన్ గోప్యతను మెరుగుపర్చుకోవచ్చు. HTTPS Everywhere అనే ఎక్స్‌టెన్షన్‌ను తప్పక వినియోగించండి. ఇది చాలా వెబ్‌సైట్‌లతో మీ కమ్యూనికేషన్‌ను ఎన్‌క్రిప్ట్ చేస్తుంది. ఫలితంగా ఇతరులు మీపై స్నూపింగ్ చేసే అవకాశాలు తగ్గుతాయి. ఈ ఎక్స్‌టెన్షన్ మీ ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ను సురక్షితంగా మారుస్తుంది. Ghostery బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్‌ను వినియోగిస్తే.. అది అన్ని థర్డ్ పార్టీ డేటా ట్రాకింగ్ ఐటెమ్‌లను గుర్తించి బ్లాక్ చేస్తుంది. AdBlock ఎక్స్‌టెన్షన్ అనేది మీరు వెబ్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు యాడ్స్‌ను ఫిల్టర్ చేస్తుంది. CheckShortURL అనేది ఉచిత సైబర్ సెక్యూరిటీ సాధనం. ఇది సంక్షిప్త URLలు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తాయో తనిఖీ చేస్తుంది.
6. ప్రైవేట్ సమాచారం కోసం పబ్లిక్ స్టోరేజీని వాడొద్దు
మీ ప్రైవేట్ సమాచారాన్ని, ఫొటోలను, డాక్యుమెంట్లను సేవ్ చేయడానికి పబ్లిక్ స్టోరేజ్ యాప్‌లను, పోర్టల్స్‌ను వినియోగించొద్దు. ఉదాహరణకు Google డాక్స్‌లో మీ పాస్‌వర్డ్‌లు లేదా ఇతర రహస్య సమాచారాన్ని సేవ్ చేయడం మంచిది కాదు. ముఖ్యమైన స్కాన్ కాపీలు, ఇతర డాక్యుమెంట్‌లు ఎన్‌క్రిప్టెడ్ ఆర్కైవ్‌లో ఉంటే తప్ప మీ డ్రాప్‌బాక్స్‌లో స్టోర్ చేయకండి. పబ్లిక్ స్టోరేజ్‌లో నిల్వచేసిన మొత్తం సమాచారం ఏదో ఒక సమయంలో అనుకోకుండా పబ్లిక్‌గా లీకయ్యే ముప్పును కలిగి ఉంటుందని గుర్తుంచుకోండి.
7. పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌లలో ప్రైవేట్‌గా ఉండండి
చాలామంది పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌లు ఉచితంగా లభిస్తే తెగ వినియోగిస్తారు. ఆ నెట్‌వర్క్‌లకు ఎన్‌క్రిప్షన్ ఉండదు. ఫలితంగా మీరు ఆ కనెక్షన్‌లో ఉండగా చేసిన మొత్తం బ్రౌజింగ్ హిస్టరీ లీకైపోతుంది. ఆ రిస్క్ ఉండకూడదంటే ప్రైవేట్ మోడ్‌లోనే బ్రౌజింగ్ చేయండి. వీపీఎన్ ద్వారా ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తే మీకు ఏ బెడదా ఉండదు.
8. సురక్షిత పాస్‌వర్డ్‌లను ఉపయోగించండి
మనకు ఆన్‌లైన్‌లో చాలా లాగిన్ ఐడీలు, పాస్‌వర్డ్‌లు ఉంటాయి. పాస్‌వర్డ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది టఫ్‌గా, అంచనా వేయలేని విధంగా ఉంటేనే బెటర్. పాస్‌వర్డ్‌లో పెద్ద అక్షరాలు, చిన్న అక్షరాలు, సంఖ్యలు, ప్రత్యేక అక్షరాలు ఉండేలా చూడండి. కనీసం 12 అక్షరాలతో పాస్ వర్డ్‌ను తయారు చేసుకోండి. పాస్‌వర్డ్ కోసం మీ పేరు, పుట్టినరోజు, పెంపుడు జంతువు పేరు వంటివి వాడొద్దు. వివిధ రకాల యాప్‌లకు ఒకే రకమైన పాస్‌వర్డ్‌ను పెట్టుకోకండి. విభిన్నంగా ఉండేలా ఆయా పాస్ వర్డ్‌లను తయారు చేసుకోండి.
9. వెబ్‌సైట్‌లలో ట్రాకింగ్ నుంచి తప్పించుకోండి
మీ బ్రౌజింగ్ హిస్టరీని ట్రాక్ చేయడానికి వెబ్‌సైట్‌లు కుకీలను ఉపయోగిస్తాయి . మీ ఆలోచనలు, ఆసక్తులను కుకీల ఆధారంగానే అంచనా వేస్తాయి. వీటి ప్రాతిపదికన మీకు ఉత్పత్తులు, సేవలను మార్కెటింగ్ చేస్తాయి. వాటి ప్రకటనలను చూపిస్తాయి. మీ అనుమతి లేకుండా వెబ్‌సైట్‌లు మీ డేటాను యాక్సెస్ చేయలేని విధంగా కుకీల సెట్టింగ్స్ చేసుకోండి. ఇందుకోసం మీరు గూగుల్ Chromeలోని గోప్యత మరియు భద్రత అనే విభాగంలోని కుకీల సెక్షన్‌ను ఆఫ్ చేస్తే సరిపోతుంది.
10. సోషల్ మీడియాలో ప్రైవసీ సెట్టింగ్‌లను మార్చేయండి
చాలామందికి తప్పకుండా సోషల్ మీడియా ఖాతాలు ఉంటాయి. ఆ ఖాతాలలోని ప్రైవసీ సెట్టింగ్ విభాగాలలోకి వెళ్లి కొన్ని సెట్టింగ్‌లు మారిస్తే మీ వ్యక్తిగత సమాచారానికి అదనపు భద్రత లభిస్తుంది. మీ పోస్ట్‌లు ఎవరు చూడాలి ? మీ లొకేషన్ ఎవరికి తెలియాలి ? వంటి అంశాలను నియంత్రించే సెట్టింగ్స్ కొన్ని ఉంటాయి. అవి చేసుకోవాలి. ఒకవేళ మీరు డీఫాల్ట్‌గా వచ్చిన సెట్టింగ్‌లనే ఫాలో అయిపోతే బ్రౌజింగ్ సమాచారమంతా సదరు సోషల్ మీడియా కంపెనీ చేతిలోకి చేరిపోతుంది.