CM Revanth Meets Union Minister Kishan Reddy : రాష్ట్రానికి సంబంధించి నిధుల విడుదల సహా, పెండింగ్ సమస్యల పరిష్కారమే అజెండాగా దిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన కొనసాగుతోంది. దిల్లీ పర్యటనలో భాగంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం అవుతున్నారు. మొదట కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో సమావేశమైన సీఎం రేవంత్ రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అనంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో భేటీ అయ్యారు.
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ భేటీ : ఆ తరువాత కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. 2017లోనే ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగాన్ని 161 ఏఏ జాతీయ రహదారిగా ప్రకటించారని గుర్తు చేశారు. ఇప్పటికే ఈ రహదారి నిర్మాణానికి అవసరమయ్యే భూమిలో 94 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరించిందని తెలిపారు. శ్రీ శైలాన్ని హైదరాబాద్ తో అనుసంధానించే ఎన్‌హెచ్ -765 లో 125 కిలోమీటర్ల దూరం జాతీయ రహదారుల ప్రమాణాలతో ఉందని చెప్పారు.
మిగిలిన 62 కిలోమీటర్లు అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో ఉందని తెలిపారు. అటవీ, పర్యావరణ శాఖ నిబంధనల ఫలితంగా ఆ మేరకు రహదారి అభివృద్ధికి ఆటంకంగా ఉందన్నారు. ఆమ్రాబాద్ అటవీ ప్రాంతంలో 4 వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని. ఇందుకు బడ్జెట్లో నిధులు మంజూరు చేయాలని గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్-విజయవాడ రహదారిని 6 వరుసలుగా విస్తరించే పనుల డీపీఆర్‌ను త్వరగా పూర్తి చేయాలని సీఎం కోరినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.
"కేంద్ర రోడ్డురవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. గంటకు పైగా గడ్కరితో తెలంగాణ రోడ్ల అభివృద్ధి గురించి చర్చించాం. జనవరిలో రీజనల్ రింగ్ రోడ్డు శంకుస్థాపన ప్రారంభోత్సవానికి రావాలని కేంద్రమంత్రిని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. రీజనల్ రింగ్ రోడ్డుకి టెక్నికల్ అనుమతులు ఇవ్వాల్సి ఉంది. డిసెంబర్ 20న ప్రాజెక్టు అప్రూవల్ కమిటీలో రీజనల్ రింగ్ రోడ్డు అనుమతులు ఇవ్వాలని కోరాం. కల్వకుర్తి నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదనలు కేంద్రమంత్రికి ఇచ్చాం అనుమతిస్తామని తెలిపారు"-కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మంత్రి
త్వరలో వాటి డీపీఆర్‌లు కేంద్రానికి ఇస్తాం : 'హైదరాబాద్ విజయవాడ ఆరు లైన్ల రహదారి జీఎంఆర్ సంస్థ పూర్తి చేయలేదు. అందుకే మరోసారి టెండర్ల పిలవడం గురించి కేంద్రమంత్రితో చర్చించాము. పెండింగ్ రోడ్డు ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలని కోరాం. తెలంగాణ లో పెండింగ్‌లోని 16 రోడ్లకు సంబంధించి రూ. 3200 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. త్వరలో వాటి డీపీఆర్‌లు కేంద్రానికి ఇస్తాం' అని మంత్రి కోమటి రెడ్డి వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిసే అవకాశం : రేపు, ఎల్లుండి కూడా సీఎం దిల్లీలోనే ఉంటారు. రేపు ఓ ఛానల్ నిర్వహిస్తున్న కాంక్లేవ్‌లో పాల్గొంటారు. దీంతో పాటు పార్టీ పెద్దలైన రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్‌ను మర్యాదపూర్వకంగా కలిసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పీసీసీ కార్యవర్గం ఎంపిక మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రజాపాలన విజయోత్సవాలపై పార్టీ పెద్దలకు వివరించే అవకాశం ఉంది.
నేడు దిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి - ఆ విషయాలపై ఏఐసీసీ పెద్దలతో చర్చించే అవకాశం?
హస్తినకు సీఎం రేవంత్ రెడ్డి - ప్రధాని మోదీతో భేటీ అయ్యే ఛాన్స్! - CM Revanth Reddy Delhi tour