Income Certificate for Ration Cards Survey : కొత్త రేషన్ కార్డుల సర్వే గందరగోళానికి దారి తీస్తోంది. సర్వే సందర్భంగా కొన్ని మండలాల్లో పంచాయతీ కార్యదర్శులు ఆదాయ ధ్రువపత్రాలు (ఇన్కమ్ సర్టిఫికెట్) అడుగుతున్నారు. మరికొన్ని చోట్ల ఆదాయ ధ్రువపత్రం కోసం నోటరీ కూడా అడుగుతున్నారు. దీంతో అర్జీదారులు అయోమయానికి గురవుతున్నారు. తమ వద్ద ప్రస్తుతం ఆదాయ ధ్రువపత్రాలు లేవని దరఖాస్తుదారులు చెబితే, కచ్చితంగా కావాల్సిందేనని కార్యదర్శులు పేర్కొంటున్నారు. దీంతో అర్జీదారులు మీ-సేవ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ ధ్రువపత్రాలు రావడానికి నిబంధన ప్రకారం వారం నుంచి పదిహేను రోజుల వ్యవధి ఉంటుంది. రేషన్‌కార్డుల సర్వేకు నేటి వరకు మాత్రమే సమయం ఉండడంతో అర్జీదారులు ఆందోళన చెందుతున్నారు.
రేషన్ కార్డుల సర్వేను ప్రభుత్వం ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు పూర్తి చేయమని ఆదేశించింది. అర్జీదారుల ఇంటికి వెళ్లి వారి వివరాలు సేకరించాలని తెలిపింది. లబ్ధిదారుల ఎంపికలో వార్షికాదాయ నిబంధనలు కూడా పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో నివసించే వారికి ఏడాదికి రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.5 లక్షల్లోపు వార్షికాదాయం ఉండాలని తెలిపింది. దీంతో పంచాయతీ కార్యదర్శులు వార్షికాదాయాన్ని తామెలా నిర్ధారిస్తామంటూ ఆదాయ ధ్రువపత్రాలు తీసుకురమ్మని అంటున్నారు.
ఒక్క రోజు వ్యవధిలోనే ధ్రువపత్రాలు : అర్జీదారులు శనివారం వరకు ఎలాగో ధ్రువపత్రాలను సమర్పించారు. ఆదివారం సెలవు కావడంతో ధ్రువపత్రాలు జారీ చేయలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం నిర్వహించిన సర్వేవి, నేడు (సోమవారం) జరిగే సర్వేకు అర్జీదారులు ఒక్క రోజులో ఆదాయ ధ్రువపత్రం ఎక్కడి నుంచి తీసుకురావాలో అధికారులకే తెలియాలి. ఇప్పటికైతే చాలా మండలాల్లో రెవెన్యూ అధికారులు ఒక్క రోజు వ్యవధిలోనే ధ్రువపత్రాలు జారీ చేస్తున్నారు.
కొత్త రేషన్‌కార్డుల అర్హులు తేలారు - జిల్లాలకు చేరిన ఫైనల్ లిస్ట్
ప్రభుత్వం గతేడాది నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే సమయంలో ప్రతి కుటుంబానికి సంబంధించి వివరాలను సేకరించింది. అందులోనే కుటుంబ వార్షికాదాయం, రేషన్‌కార్డు ఉందీ లేనిదీ అందులో నమోదు చేశారు. ఆ సర్వే ఆధారంగా రేషన్‌కార్డుల జారీకి సంబంధించిన పరిశీలన జాబితాను ప్రభుత్వం విడుదల చేయగా, తాజాగా ఆదాయ ధ్రువపత్రం కావాలని అడగడంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు.
అర్జీదారులు మీ-సేవ కేంద్రాలకు, తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లడంతో ఒక్కొక్కరికి రూ.200 వరకు ఖర్చవుతుంది. ఈ విషయమై కామారెడ్డి డీఎస్‌వో మల్లికార్జున్ బాబును వివరణ కోరగా రేషన్‌కార్డుల సర్వేలో కచ్చితంగా ఆదాయ ధ్రువపత్రాలు కావాలని ఏమీ అడగలేదని తెలిపారు. అర్జీదారుల పట్టాపాస్ పుస్తకాలు ఉంటే చూడాలని మాత్రమే చెప్పామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి అర్జీదారులకు ఇబ్బంది కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
కొత్త రేషన్ కార్డుల జారీ డేట్ ఫిక్స్ - సభ్యుల వివరాలు చేర్చేదానిపై ఆరోజే స్పష్టత
కొత్త రేషన్‌కార్డుల కోసం ఎదురు చూస్తున్నారా? - వారంలో కీలక ప్రకటన