Thyagaraja Aradhana Utsavalu Celebrations : శ్రీ త్యాగరాజ సంగీత ఆరాధనోత్సవాల్లో భాగంగా సంగీత గురువులు డాక్టర్ మృదుల కిరణ్ చావలి, పుచ్చా రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో హైదరాబాద్ మోతీ నగర్‌లో నగర సంకీర్తన ఘనంగా నిర్వహించారు. బీఎస్పీ కాలనీలోని సుప్రియ టవర్స్ నుంచి మోతీనగర్‌లోని శంకర మఠం వరకు సాగిన నగర సంకీర్తనలో పెద్ద సంఖ్యలో కర్ణాటక శాస్త్రీయ సంగీతజ్ఞులు, విద్యార్థినీ విద్యార్థులు, శ్రీ త్యాగరాజ భక్తులు పాల్గొన్నారు. శ్రీ త్యాగరాజస్వామి వేషధారణలో చిన్నారి బాలార్క చూపరులను ఆకట్టుకున్నాడు. నగర సంకీర్తన సమయంలో కళాకారులు శ్రీ త్యాగరాజ కీర్తనలు ఆలపించారు.
త్యాగరాజ ఆరాధనోత్సవాలు : మరోవైపు సూర్యాపేట జిల్లా కేంద్రంలోనూ త్యాగరాజ ఆరాధనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. గత 22 ఏళ్లుగా స్థానిక సుధా బ్యాంకు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న త్యాగరాజ ఆరాధన ఉత్సవాల్లో పలువురు సంగీత విద్వాంసులను సన్మానించారు. ఈ ఏడాది ప్రముఖ స్వర సంగీతకారులు డాక్టర్ ద్వారం లక్ష్మిని సన్మానించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో గత 22 సంవత్సరాలుగా త్యాగరాజ ఆరాధన ఉత్సవాలను సుధా బ్యాంకు ఆధ్వర్యంలో నిర్వహించడం అభినందనీయమని రామాయణ పద కోకిల సంగీత ఆచార్య డాక్టర్ ద్వారం లక్ష్మీ అన్నారు.
శనివారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని త్రివేణి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన 22వ త్యాగరాజ ఆరాధన ఉత్సవాల్లో ఆమె సన్మాన గ్రహీతగా పాల్గొని మాట్లాడారు. ఎక్కడో కర్ణాటక మద్రాసు ప్రాంతాల్లో త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు నిర్వహించడం విశేషం కాదని, ఇక్కడ మారుమూల సూర్యాపేట పట్టణంలో త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. సంగీత కళాకారులు మాత్రమే ఇలాంటి త్యాగరాజ ఆరాధన ఉత్సవాలను నిర్వహిస్తారని అన్నారు. ఈ సందర్భంగా పోపూరి పల్లవి బృందం ఆలపించిన శాస్త్రీయ సంగీత గాత్ర కచేరి ఎంతగానో ఆకట్టుకుంది. సంగీతకారులు ద్వారం లక్ష్మిని శాలువాలతో ఘనంగా సన్మానించారు.
Thousands of Folk Bhajan Devotees In Yadadri : హరినామ సంకీర్తనలతో ప్రతిధ్వనించిన యాదాద్రి