Strong Security for Bigg Boss Grand Finale : ప్రముఖ రియాల్టీ షో బిగ్‌బాస్.. సీజన్8ను సెప్టెంబర్1వ తేదీన గ్రాండ్‌గా మొదలుపెట్టారు. ఎంటర్‌టైన్‌మెంట్, ఫన్, టర్న్‌లు, ట్విస్ట్‌లకు లిమిటే లేదు అంటూ ఈసారి కూడా హోస్ట్‌గా నాగార్జున సందడి చేశారు. ఇన్ఫినిటీ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతో మొదలైన ఈ సీజన్.. చివరి దశకు చేరుకుంది. మరో నాలుగు రోజుల్లో ఈ షోకు ఎండ్‌కార్డ్ పడనుంది. డిసెంబర్ 15వ తేదీన జరగనున్న గ్రాండ్ ఫినాలే వేళ బిగ్‌బాస్ షోపై పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
షో మొదట్లో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ 7 జంటలుగా బిగ్‌బాస్ హౌజ్‌లోకి వెళ్లారు. అలాగే ఈ సీజన్‌కు సంబంధించి మూడు కండీషన్స్ పెట్టాడు బిగ్‌బాస్. ఈ సీజన్‌లో హౌస్‌కు కెప్టెన్ ఉండడు అన్నట్టుగానే.. కెప్టెన్ ప్లేస్‌లో చీఫ్‌ను పెట్టారు. కంటెస్టెంట్స్ స్వయంగా సంపాదించుకోవాలని చెప్పి రేషన్ ఇవ్వలేదు. అలాగే ప్రైజ్‌మనీ జీరో అనీ, హౌస్‌మేట్స్ ఆటను బట్టి ప్రైజ్‌మనీ లిమిట్‌లెస్‌గా మారుతుందన్నారు. ఆ తర్వాత వైల్డ్‌కార్డ్‌తో 8 మందిని హౌజ్‌లోకి పంపించారు.
ముందుగా హౌజ్‌మేట్స్ వర్సెస్ వైల్డ్‌కార్డ్స్ అన్నట్టుగా పలు గేమ్స్ పెట్టి, నామినేషన్స్‌లో ఊహించని ట్విస్ట్‌లు ఇచ్చారు. ఆ తర్వాత అందరినీ కలిపేసి ఒకే టీమ్ అంటూ కంటెండర్ పోటీలో ఫైట్ చేయమన్నారు. దీంతో హౌజ్‌మేట్స్ మధ్య లెక్కలు మారుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే 17 మంది కంటెస్టెంట్లు ఎలిమినేటై.. ప్రస్తుతం హౌజ్‌లో టాప్ 5 ఫైనలిస్టులు అవినాష్, నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబీల్ మాత్రమే మిగిలారు. ఈ ఐదుగురిలో ఒకరు డిసెంబర్ 15వ తేదీన జరిగే గ్రాండ్ ఫినాలేలో ట్రోఫీ తీసుకోనున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ నెల 15వ తేదీ ఆదివారం రోజున బిగ్‌బాస్ సీజన్–8 ఫైనల్ జరగనుంది. ఈ నేపథ్యంలో.. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అల్లర్లు, గొడవలకు తావులేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారని సమాచారం. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 5లోని అన్నపూర్ణ స్టూడియోలో బిగ్‌బాస్ సెట్టింగ్ వేయగా.. ఫైనల్ కూడా ఇక్కడే జరగనుంది. గత సంవత్సరం డిసెంబర్ 17వ తేదీన బిగ్‌బాస్ సీజన్–7 ఫైనల్ సందర్భంగా తలెత్తిన పరిణామాలు, గొడవలు, బస్సులపై రాళ్లు రువ్వడం తదితర అనుభవాల దృష్ట్యా ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారట.
ఇందులో భాగంగానే అన్నపూర్ణ స్టూడియో చుట్టూ 53 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని.. ఇప్పటికే పోలీసులు ఆయా పాయింట్లతో కూడిన జాబితాను అన్నపూర్ణ స్టూడియో, బిగ్‌బాస్ యాజమాన్యానికి అందజేశారని సమాచారం. గత ఏడాది ఫైనల్ సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడకు చేరుకున్న అభిమానులు.. ఒకానొక సందర్భంలో బస్సులపై రాళ్లు రువ్వి గొడవకు దిగడంతో.. అప్పటి బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్‌తో పాటు బిగ్‌బాస్, అన్నపూర్ణ స్టూడియో యాజమాన్యంపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది.
అయితే.. అక్కడ సీసీ కెమెరాలు లేకపోవడంతో దాడికి పాల్పడ్డ వారిని గుర్తించడంలో పోలీసులకు చాలా ఇబ్బందులు తలెత్తాయి. దీంతో చాలామంది తప్పించుకున్నారు. ఈసారి ఎలాంటి సంఘటన జరిగినా వెంటనే గుర్తించేందుకు వీలుగా బిగ్‌బాస్ షో జరిగే స్టూడియో చుట్టూ 53 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఎక్కడెక్కడ కెమెరాలు ఏర్పాటు చేయాలో జూబ్లీహిల్స్ పోలీసులు ఆ పాయింట్లను బిగ్‌బాస్ యాజమాన్యానికి అందజేశారు. ఈ నెల 14వ తేదీన ఉదయమే వీటిని అమర్చుకోవాలని సూచించారు. అలా.. ఏ సీజన్‌కూ లేని విధంగా.. ఈ సీజన్‌కు సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.
"తమ్ముడంటే జెలస్ - త్వరలోనే స్ట్రెయిట్ తెలుగు సినిమా" - బిగ్‌బాస్‌లో హీరో సూర్య సందడి!