WhatsApp New Feature:ప్రముఖ ఇన్స్టంట్ యాప్ వాట్సాప్ స్టేటస్ ప్రియుల కోసం మరో అద్భుతమైన ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఇటీవలే మ్యూజిక్ ఆఫ్ స్టేటస్ అప్డేట్స్ పేరుతో ఓ ఫీచర్‌ను పరిచయం చేయగా తాజాగా ఒకే స్టేటస్‌ను మూడు యాప్‌లలో స్టోరీలుగా పెట్టుకునే సదుపాయాన్ని తీసుకువచ్చేందుకు రెడీ అయింది. ఈ మేరకు ఈ ఇంట్రెస్టింగ్ ఫీచర్ త్వరలో వాట్సాప్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లుగా మెటా తన బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది.
సాధారణంగా మనకు నచ్చిన విషయాన్ని వాట్సాప్‌లోని మన కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవారితో పంచుకునేందుకు స్టేటస్లు పెడుతుంటాం. అయితే ఇదే వాట్సాప్ స్టేటస్‌ను ఫేస్‌బుక్‌లోనూ స్టోరీగా పెట్టుకోవచ్చు. ఇందుకోసం స్టేటస్ ఆప్షన్లోనే ఫేస్బుక్ అనే కొత్త ఆప్షన్ వాట్సాప్‌లో ఇప్పటికే అందుబాటులో ఉంది. ఇప్పుడు ఇందులో ఇన్‌స్టాగ్రామ్ కూడా యాడ్ కానుంది. అంటే ఇకపై వాట్సాప్‌లో పెట్టే స్టేటస్‌ను నేరుగా ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లలోనూ స్టోరీలుగా పెట్టేయొచ్చు. దీని కోసం ప్రత్యేకంగా యాప్‌నకు వెళ్లి అప్‌లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు.
ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చాక వాట్సాప్ స్టేటస్ పెట్టే సమయంలో ఫేస్బుక్ స్టోరీ, ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ అని రెండు ఆప్షన్లు కనిపించనున్నాయి. వాటిని ఎనేబల్ చేసుకొని ఈ సదుపాయాన్ని పొందొచ్చు. ఒక వేళ వద్దనుకుంటే డిసేబుల్ కూడా చేసేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ని వాట్సాప్ ప్రపంచ వ్యాప్తంగా రోలవుట్ చేయనుంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది. దీంతో పాటు అవతార్స్, మెటా ఏఐ స్టిక్కర్స్ వంటి కొంగొత్త ఫీచర్లు కూడా వాట్సాప్‌లో అందుబాటులోకి రానున్నాయి.
మ్యూజిక్ ఆఫ్ స్టేటస్ అప్డేట్స్:వాట్సాప్ ఈ కొత్త ఫీచర్‌ను ఇటీవలే పరిచయం చేసింది. పేరుకు తగ్గట్టుగానే ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ ఫేవరెట్ మ్యూజిక్‌ను వాట్సాప్ స్టేటస్‌కి యాడ్ చేయొచ్చు. ఇప్పటి వరకు వాట్సాప్‌లో స్టేటస్ పెడితే దానితో మ్యూజిక్‌ను అటాచ్ చేసే ఆప్షన్ లేదు. అయితే ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మీకు ఇష్టమైన మ్యూజిక్‌ను మీ స్టేటస్‌తో అటాచ్ చేయొచ్చు.