WhatsApp Favourite Feature :ప్రముఖ మేసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్ల సౌలభ్యం కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంటుంది. తాజాగా నేవిగేషన్ను మరింత సులభం చేస్తూ 'ఫేవరెట్స్' అనే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అలాగే ఐఫోన్ యూజర్ల కోసం ఓ అప్డేట్ను తీసుకొచ్చింది. మరెందుకు ఆలస్యం యూజర్ల కోసం తీసుకొచ్చిన ఈ ఫీచర్లపై ఓ లుక్కేద్దాం రండి.
ఇంతకు ముందు ఎవరికైనా వాట్సాప్‌లో కాల్ చేయాలన్నా, మెసేజ్ చేయాలన్నా చాట్ లిస్టులో గానీ, కాంటాక్ట్ లిస్టులో గానీ వారి పేరు వెతకాల్సి వచ్చేది. తాజా ఫీచర్‌తో ఇది మరింత సులభం కానుంది. ఫేవరెట్స్‌లో యాడ్ చేసిన పేర్లు కాల్స్ ట్యాబ్ క్లిక్ చేయగానే పైన కనిపిస్తాయి. దీంతో ఈజీగా వాట్సాప్ కాల్స్, చాటింగ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ వల్ల కాల్స్, మెసేజ్ చేయడం కోసం చాట్ లిస్టు, కాంటాక్ట్ లిస్టులో పేరును వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఈ ఫీచర్ మరికొద్ది వారాల్లో వాట్సాప్ వినియోగదారులందరికీ అందుబాటులోకి వస్తుందని కంపెనీ ప్రకటించింది.
వాట్సాప్‌లో ఫేవరెట్స్‌ను యాడ్ చేయడం ఎలా?
వాట్సాప్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత 'కాల్స్' బటన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత 'Add to Favourite' అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. మీరు ఎంపిక చేసుకున్న వ్యక్తుల కాంటాక్ట్ నంబర్లను సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఆ నంబర్లన్నీ ఫేవరెట్స్‌లో యాడ్ అవుతాయి. వాట్సాప్ సెట్టింగ్స్‌ను ఓపెన్ చేసి Settings > Favorites > Add to Favouritesపై క్లిక్ చేసినా సరిపోతుంది.