Tata and Kia Cars Price Hike:కొత్త సంవత్సరానికి రోజులు దగ్గర పడుతున్న కొద్దీ కార్ల తయారీ కంపెనీలు ఒక్కొక్కటిగా దేశీయంగా తమ ఉత్పత్తుల ధరలు పెంచేస్తున్నాయి. ప్రముఖ సంస్థలు ఇప్పటికే ధరల పెంపును ప్రకటించగా.. తాజాగా టాటా మోటార్స్, కియా కూడా ఆ జాబితాలో చేరాయి. వచ్చే ఏడాది నుంచి తమ కార్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించాయి. ఈ సందర్భంగా ఈ ధరల పెంపు ఎప్పటి నుంచి? ఎంత శాతం? వంటి వివరాలు మీకోసం.
కొత్త ధరలు ఎప్పటినుంచి?:జనవరి 1 నుంచి సవరించిన ఈ సవరించిన ధరలు అమల్లోకి రానున్నట్లు టాటా మోటార్స్, కియా సంస్థలు తెలిపాయి. ఈ మేరకు తమ ప్యాసింజర్వెహికల్స్ ధరలను 3 శాతం వరకు పెంచనున్నట్లు టాటా మోటార్స్ సోమవారం తెలిపింది. వీటితో పాటు ఎలక్ట్రికల్వాహనాల ధరలనూ పెంచుతున్నట్లు పేర్కొంది. ఉత్పత్తి వ్యయం పెరిగిన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.
మరోవైపు ఆటోమొబైల్ కంపెనీ కియా సైతం జనవరి 1 నుంచి తన కార్లధరలను 2 శాతం మేర పెంచనున్నట్లు ప్రకటించింది. ముడిసరకు ధరలు పెరగడం, సప్లయ్ చైన్ వ్యయాలు అధికమవ్వడం కారణంగా ధరలను పెంచక తప్పడం లేదని పేర్కొంది. ఇప్పటి వరకు దేశీయంగా 16 లక్షల యూనిట్లు విక్రయించినట్లు కియా ఓ ప్రకటనలో తెలిపింది.