Swiggy Celebrates 10 Years:ప్రస్తుత కాలంలో నచ్చిన ఫుడ్ నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తుండడంతో అంతా స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ సంస్థల యాప్‌లను ఆశ్రయిస్తున్నారు. ఈ యాప్‌లకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. అయితే స్విగ్గీ యాప్‌లో ఒక్క ఆర్డర్ కూడా రాని రోజు ఉందని, ఆ రోజు ఆర్డర్ కోసం చాలా ఎదురుచూశామని స్విగ్గీ సీఈవో తెలిపారు. స్విగ్గీ ప్రస్థానం స్థాపించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా తమ జర్నీపై ఇంట్రస్టింగ్ విషయాలను పంచుకున్నారు.
'ఆ రోజు ఒక్క ఆర్డరూ రాలేదు': స్విగ్గీని ప్రారంభించిన మొదటి రోజు ఫుడ్ ఆర్డర్ కోసం ఎంతగానో ఎదురుచూడగా ఒక్క ఆర్డర్ కూడా రాలేదని సీఈవో శ్రీహర్ష తెలిపారు. రెండో రోజు ట్రఫుల్స్ రెస్టారంట్ నుంచి రెండు ఫుడ్ ఆర్డర్లు వచ్చినట్లు పేర్కొన్నారు. రెండు ఆర్డర్లతో మొదలై ఇప్పుడు ప్రతి ఇంట్లో స్విగ్గీ పేరు వినిపిస్తుందన్నారు.
3లక్షల రెస్టారెంట్లతో భాగస్వామ్యం:మొదట రెండు ఆర్డర్లు వచ్చిన ట్రఫుల్స్ రెస్టారెంట్ తమ భాగస్వాముల్లో ఒకటని శ్రీహర్ష చెప్పారు. ఈ రోజు 3లక్షల రెస్టారెంట్లతో భాగస్వామ్యం కలిగి ఉన్నట్లు తెలిపారు. ఇది తమకెంతో గర్వకారణమని పేర్కొన్నారు. తమ ప్రయాణంలో సహకరించిన కస్టమర్లు, వ్యాపార భాగస్వాములకు శ్రీహర్ష కృతజ్ఞతలు తెలిపారు.