Stolen Device Protection Iphone : ఐఫోన్ భద్రతకు పెట్టింది పేరు. ఇందులోని సెక్యూరిటీ ఫీచర్స్ కారణంగానే ఐఫోన్‌ను చాలా మంది ఉపయోగిస్తారు. కొంచెం రేటు ఎక్కువైనా సాధ్యమైతే ఐఫోన్‌ను కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. ఇందులోని ఎకో ఫ్రెండ్లీ నేచర్, చాలా మంది దీన్నొక స్టేటస్ సింబల్ లాగా చూడటం కూడా కారణాలుగా చెప్పవచ్చు.
అయితే తాజాగా ఐఫోన్ వినియోగదారులకు ఆ సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. iOS 17.3 సాఫ్ట్వేర్ అప్డేట్ను తీసుకొచ్చింది. ఇందులోని ఓ ఫీచర్ మీ భద్రతను మరింత పెంచుతుంది. ఆ ఫీచర్ పేరే 'స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్'. ఇది మీ వ్యక్తిగత వివరాలు మరొకరి చేతుల్లోకి వెళ్లకుండా కాపాడుతుంది. ఫోన్ దొంగతనానికి గురైనప్పుడు, వేరొకరు ఉపయోగించిన సందర్భంలో మీకు ఉపయోగపడుతుంది.
యాక్సెస్ చేయడం అంత ఈజీ కాదు
'స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్' ఫీచర్, ఫేస్ ఐడీ లేదా టచ్ ఐడీని మించి డేటా లాక్ చేస్తుంది. ఒకవేళ మీ ఫోన్ చోరీకి గురైతే ఎవరికైనా మీ పాస్వర్డ్ తెలిసినా ఈ ఫీచర్‌ను ఆన్ చేయడం వల్ల మీ డేటాను యాక్సెస్ చేయలేరు. ముఖ్యంగా ఐక్లౌడ్ కీచైన్‌లోని పాస్వర్డ్ యాక్సెస్ చేయలేరు. మొత్తంగా చెప్పాలంటే ఇది మీ ఫోన్లోని గోప్యమైన సమాచారానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది.
ఇందులోని మరో ఫీచర్ ఏంటంటే మీరు యాపిల్ ఐడీ వంటి సెక్యూరిటీ సమాచారాన్ని మార్చాలనుకున్నప్పుడు దాదాపు గంట సేపు వేచి ఉండాల్సి వస్తుంది. తర్వాతే ఫేస్ ఐడీ, టచ్ ఐడీ పనిచేస్తుంది. దీని వల్ల మన ఫోన్ పోయినప్పుడు ఇతరులు డేటా యాక్సెస్ చేయడం లేదా పాస్వర్డ్ మార్చటం లాంటివి సులభంగా చేయలేరు.