SpaceX Starship Test Failure:ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలోన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ ప్రయోగించిన రీయూజబుల్ భారీ రాకెట్ స్టార్‌షిప్ విఫలమైంది. దీన్ని గురువారం టెక్సాస్‌లోని స్టార్‌బేస్ ఫెసిలిటీ సెంటర్ నుంచి EST సాయంత్రం 5:37 గంటలకు (జనవరి 17న ఉదయం 4:07 గంటలకు) విజయవంతంగా ప్రయోగించారు. అయితే ప్రయోగించిన కొద్ది నిమిషాలకే అది ఫెయిల్ అయిపోయింది.
ఈ స్టార్‌షిప్ భూ వాతావరణంలోకి చేరుకున్న కొద్దిసేపటికే రాకెట్ కింది భాగంలో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో రాకెట్‌కు సంబంధించిన శకలాలు కరేబియన్ సముద్రంలో పడిపోయాయి. పెద్ద ఎత్తున మంటలను గాల్లో చిమ్ముతూ శకలాలు పేలిపోయాయి.
దీంతో ఈ రాకెట్‌ను మళ్లీ కిందకు తీసుకురావాల్సి వచ్చింది. ఈ ఘటనతో అంతరిక్ష రంగంలో క్రమంగా పురోగతి సాధిస్తున్న మస్క్ స్పేస్ఎక్స్కు గట్టి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పొచ్చు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
ఈ స్టార్‌షిప్ అనేది స్పేస్ఎక్స్ అతిపెద్ద, అత్యంత శక్తివంతమైన రాకెట్. ఈ రీయూజబుల్ రాకెట్‌ను ఏడోసారి ఫ్లైట్ టెస్ట్‌లో భాగంగా ప్రయోగించారు. ఈ సెవెన్త్ స్టార్‌షిప్ కక్ష్య వేగాన్ని చేరుకుని 10 డమ్మీ స్పేస్ క్రాఫ్ట్‌లను ప్రయోగించేందుకు ప్రయత్నించాల్సి ఉంది. అయితే ఈ ప్రయోగం విఫలం కావడంతో ఈ ప్రయత్నం విజయవంతం కాలేదు.
ఈ డమ్మీ అంతరిక్ష నౌకలను భవిష్యత్తులో ప్రయోగించబోయే అప్‌గ్రేడ్ చేసిన స్పేస్ఎక్స్ స్టార్‌లింక్ ఉపగ్రహాల పరిమాణం, బరువు, డిజైన్‌కు సరిపోయేలా రూపొందించారు. తద్వారా వాటిని పూర్తిగా పరీక్షించేందుకు ప్లాన్ చేశారు. ఈ మిషన్‌ను ఈ ఉద్దేశంతోనే ప్రయోగించారు. కానీ దాదాపు ఎనిమిదిన్నర నిమిషాల తర్వాత స్పేస్ఎక్స్ టీమ్ సెవెన్త్ స్టార్‌షిప్‌తో సంబంధాన్ని కోల్పోయింది. దీంతో ఈ రాకెట్ విఫలమైనట్లు ప్రకటించారు.
బూస్టర్‌లో మంటలు:సాధారణంగా రాకెట్ దిగువ భాగాన్ని సూపర్ హెవీ బూస్టర్ అంటారు. అయితే ఇవాళ స్టార్‌షిప్ ఫ్లైట్ టెస్ట్‌లో ఈ భాగం మంటల్లో చిక్కుకుంది. అయినప్పటికీ స్పేస్ఎక్స్ బృందం దానిని విజయవంతంగా భూమికి తీసుకురాగలిగింది. భూమికి కొంచెం పైన రాకెట్‌ను పట్టుకోవడానికి స్పేస్ఎక్స్ టీమ్ పెద్ద మెకానికల్ ఆర్మ్స్ను ఉపయోగించింది. ఇలా ఆ ప్రాంతంలో అతిపెద్ద పేలుడు జరగకుండా ఆపగలిగింది.