Phone Hanging Solution : ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో, శక్తిమంతమైన హార్డ్వేర్లతో వివిధ స్మార్ట్‌ఫోన్ మోడళ్లు మార్కెట్లోకి వస్తున్నాయి. వినియోగదారులు కొనుగోలుకు సై అంటున్నారు. అయితే క్రమంగా ఫోన్ల పనితీరు నెమ్మదించడం, హ్యాంగ్ అవ్వడం వంటి సమస్యలు తలెత్తున్నాయి. మరి ఫోన్ హ్యాంగ్ అవ్వడానికి కారణం ఏంటి? ఏయే టెక్నిక్ పాటిస్తే అలాంటి సమస్యలు రాకుండా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇలా చేయండి!
ఫోన్ హ్యాంగ్ అయిన చాలా సందర్భాల్లో రీస్టార్ట్ చేస్తే ఆ సమస్య తీరిపోతుంది. ఇలా రీస్టార్ట్ చేయాలంటే మొబైల్లోని పవర్ మెనూ ఆప్షన్ కనిపించేంతవరకూ పవర్ బటన్ని ప్రెస్ చేసి ఉంచాలి. తరువాత వచ్చే ఆప్షన్లలో రీస్టార్ట్ లేదా రీబూట్ బటన్‌పై క్లిక్ చేయాలి. మీ ఫోన్ హ్యాంగ్ అయ్యేలా చేసే ఏవైనా తాత్కాలిక అవాంతరాలు ఉంటే వాటిని తొలగించేందుకు ఇది ఉపయోగపడుతుంది. అప్పటికీ ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ఈ టెక్నిక్లను పాటిస్తే మొబైల్ హ్యాంగ్ అవ్వకుండా చూడొచ్చు.
అవసరం లేని యాప్‌లను క్లోజ్ చేయండి
అన్రెస్పాన్సివ్ యాప్‌ల వల్ల కూడా ఫోన్ హ్యాంగ్ అవ్వవచ్చు. అందువల్ల అలాంటి అవసరం లేని యాప్‌లను క్లోజ్ చేయండి. దీనివల్ల కొంత స్టోరేజ్ సేవ్ అవుతుంది. ఫోన్ సరిగా పనిచేసేందుకు ఈ విధంగా చేయడం చాలా అవసరం.
యాప్ క్యాచీని క్లియర్ చేయండి
స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌లను ఉపయోగిస్తున్నప్పుడు క్యాచీ అనేది జనరేట్ అవుతుంది. ఈ క్యాచీ డేటా ఎక్కువైతే ఫోన్ పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. దీనిని డిలీట్ చేయడానికి యాప్ మెనూపై క్లిక్ చేయాలి. ఎబౌట్ యాప్ ఆప్షన్‌ను ఎంచుకుని అందులో స్టోరేజ్ అనే మెనూను సెలెక్ట్ చేయాలి. స్టోరేజ్ విభాగంలోని క్లియర్ క్యాచీపై క్లిక్ చేయాలి. దీంతో ఫోన్ హ్యాంగింగ్కు కారణమైన క్యాచీ డిలీట్ అవుతుంది.
యాప్‌లను అప్డేట్ చేయండి
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, యాప్‌లను ఉపయోగించే వారందరూ ఎప్పటికప్పుడు ఫోన్ అప్డేట్ చేసుకోవాలి. దీనివల్ల కొత్త సాప్ట్‌వేర్ ఇన్‌స్టాల్‌అయ్యి స్మార్ట్‌ఫోన్ మరింత వేగంగా పనిచేస్తుంది. ఇందుకు ఫోన్లో ఉండే సెట్టింగ్స్ ఆప్షన్‌లోకి వెళ్లి దానిలో సిస్టమ్ అప్డేట్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. దానిలో అప్డేట్ అని ఏదైనా కనిపిస్తే వెంటనే తమ ఫోన్లో లేటెస్ట్ వెర్షన్‌ను అప్డేట్ చేసుకోవాలి.
అవసరంలేని ఫైల్స్‌ను డిలీట్ చేయండి
స్మార్ట్‌ఫోన్‌లో మనకు అవసరం అయినప్పుడు కొన్నియాప్‌లు, వీడియోలను డౌన్లోడ్ చేసుకుంటుంటాం. వీటితో పాటు ఫోటోలు, ఫైల్లను సేవ్ చేస్తుంటాం. వీటిలో అవసరం అయిన ఫైళ్లు, ఫోటోలను ఉంచుకుని మిగిలిన వాటిని డిలీట్ చేయాలి. ఇలా చేయడం వల్ల మీ స్మార్ట్‌ఫోన్ స్టోరేజ్‌లో ఖాళీ అవుతుంది. ఫలితంగా మీ ఫోన్ పనితీరు మెరుగుపడుతుంది.