Paytm Launches India's First Solar Soundbox:భారత్‌లో ప్రముఖ UPI అగ్రిగేటర్లలో పేటీఎం ఒకటి. దీని గురించి భారతీయులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడంతా డిజిటల్ పేమెంట్స్‌పైనే మొగ్గు చూపిస్తున్న తరుణంలో పేటీఎం ఇంటర్నేషనల్ UPI పేమెంట్స్‌ను ఇటీవలే లాంఛ్ చేసింది. దీని ద్వారా మన భారతీయులు విదేశాల్లోనూ పేటీఎం సౌకర్యాన్ని వినియోగించే వెసులుబాటును కల్పించింది.
తాజాగా పేటీఎం మాతృసంస్థ 'వన్97 కమ్యూనికేషన్స్' మరో విషయంతో ముందుకు వచ్చింది. వ్యాపారుల కోసం మన దేశంలోనే మొట్టమొదటి సౌరశక్తితో పనిచేసే 'సోలార్ పేమెంట్ సౌండ్‌బాక్స్'ను లాంఛ్ చేసింది. ఇది పగటిపూట సాధారణ సూర్యకాంతిలోనే ఛార్జ్ అవుతుంది. ఈ మేరకు తక్కువ సూర్యకాంతితో ఛార్జ్ అయ్యేలా దీన్ని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.
దీంతో విద్యుత్ ఛార్జ్ లేదా కనెక్షన్ అవసరం లేకుండానే దీన్ని వినియోగించుకోవచ్చు. తద్వారా విద్యుత్ ఖర్చులు తగ్గించుకోవచ్చు. ఈ నేపథ్యంలో చిన్న వీధి వ్యాపారులకు ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉండనుంది. ఇలా వ్యాపారులకు విద్యుత్ ఖర్చుల్ని తగ్గించేందుకు వీటిని అందుబాటులోకి తెచ్చినట్లు పేటీఎం వెల్లడించింది.
పేటీఎం సోలార్ సౌండ్ బాక్స్ ఫీచర్లు అండ్ స్పెక్స్:ఈ పేటీఎం సోలార్ సౌండ్ బాక్స్‌ల పైభాగంలో సోలార్ ప్యానెల్ ఉంటుంది. దీంతో ఈ బాక్స్‌ను సూర్యకాంతి తగిలేలా ఎండలో ఉంచితే అది ఆటోమెటిక్‌గా ఛార్జ్ అవుతుంది. ఇకపోతే ఇందులో రెండు బ్యాటరీలు ఉంటాయి. అందులో ఒకటి సౌరశక్తితో ఛార్జ్ అయితే, మరొక బ్యాటరీని కరెంట్‌తో ఛార్జ్ చేయొచ్చు. దీన్ని సౌకశక్తితో 2 నుంచి 3 గంటలు ఛార్జ్ చేస్తే రోజుంతా వాడేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది.