ChatGPT on Whatsapp and Landlines: ఏఐ ఆధారిత చాట్‌జీపీటీని తీసుకొచ్చి సంచలనం సృష్టించిన ఓపెన్‌ఏఐ తాజాగా మరో సదుపాయాన్ని తీసుకొచ్చింది. వాట్సాప్‌తో పాటు ల్యాండ్లైన్లోనూ చాట్‌జీపీటీ సేవలు వినియోగించుకునే అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. దీంతో ఇకపై వేరే యాప్, అకౌంట్‌తో పనిలేకుండా నేరుగా వాట్సాప్, ల్యాండ్‌లైన్ నుంచి టెక్స్ట్ లేదా కాల్ చేసి ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీని వినియోగించుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం రండి.
ప్రస్తుత కాలంలో చాట్‌జీపీటీ గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఇది మంచి ప్రజాదరణతో దూసుకుపోతోంది. ఏదైనా విషయంపై టైప్ చేయాలన్నా, దేని గురించైనా తెలుసుకోవాలన్నా అంతా ఇప్పుడు చాట్‌జీపీటీలోనే సెర్చ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది యూజర్ అడిగిన ప్రశ్నలను అర్థం చేసుకుని పూర్తి వివరాలతో చిటికెలో సమాధానాన్ని సిద్ధం చేసి అందజేస్తుంది. ఇలా వినియోగదారులకు కావాల్సిన సమాచారాన్ని క్షణాల్లో అందిచడంతో టెక్ ప్రియులు ఎక్కువగా చాట్‌జీపీటీని వినియోగిస్తున్నారు.
ఇక ఓపెన్ఏఐతాజాగా తీసుకొచ్చిన సదుపాయంతో వాట్సాప్‌లోనే చాట్‌జీపీటీని వినియోగించుకోవచ్చు. ఇందుకోసం కంపెనీ +18002428478 నంబర్‌ను కేటాయించింది. ఇకపై వినియోగదారులు తమకు ఏం కావాలన్నా ఈ నంబర్‌తో వాట్సాప్‌లో చాట్ చేసి అడగొచ్చు. మనం అడిగిన ప్రశ్నలకు ఈ చాట్‌జీపీటీ నంబర్ నుంచి రిజల్ట్ వస్తుంది. ఈ సదుపాయాన్ని ఇండియాలోనూ వినియోగించుకోవచ్చు. అంతేకాక ఈ నంబర్‌కు కాల్ చేసి కూడా చాట్‌జీపీటీ సర్వీసులు పొందొచ్చు. అయితే కంపెనీ ప్రస్తుతానికి ఈ సర్వీసులను కేవలం అమెరికా, కెనడా దేశాలకు మాత్రమే పరిమితం చేసింది.
సాధారణంగా చాట్‌జీపీటీ సేవలను పొందాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే వాట్సాప్‌లో తీసుకొచ్చిన ఈ సదుపాయంతో ఇకపై ప్రత్యేకంగా అకౌంట్ అవసరం లేదు. అయితే రోజువారీ వినియోగంపై లిమిట్స్ ఉంటాయి. పరిమితి దగ్గర పడ్డాక నోటిఫికేషన్ ద్వారా ఆ సమాచారం అందుతుంది.