Eclipses In 2025:మరికొన్ని గంటల్లో న్యూ ఇయర్ రాబోతుంది. ఈ నేపథ్యంలో రాబోయే సంవత్సరంలో జరగబోయే ఎన్నో విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం అందరిలో ఉంటుంది. వాటిలో ముఖ్యంగా సూర్య, చంద్ర గ్రహణాల గురించి తెలుసుకోవాలని అనుకుంటారు. ఎందుకంటే వీటికి ఖగోళ దృక్కోణంలో మాత్రమే కాక సనాతన ధర్మంలో కూడా చాలా ప్రాముఖ్యత ఉంది.
అంతరిక్షంలో ఏర్పడే సూర్య, చంద్ర గ్రహణాలు కూడా ఏడాది పొడువునా మన జాతకంపై ప్రభావం చూపుతాయని శాస్త్రం చెబుతోంది. ఈ నేపథ్యంలో 2025 కొత్త సంవత్సరంలో ఎన్ని గ్రహణాలు ఏర్పడతాయి? వాటిలో ఎన్ని మన దేశంలో కన్పిస్తాయి? ఇవి భారత్‌పై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? సూతక్ కాలం ఎప్పుడు? ఇది మనకు వర్తిస్తుందా? అనే ప్రశ్నలు చాలా మందిలో ఉంటాయి. ఈ సందర్భంగా వీటి వివరాలు మీకోసం.
2025లో ఎన్ని గ్రహణాలు ఏర్పడతాయి?:వచ్చే ఏడాది సంభవించే గ్రహణాలపై ఉజ్జయిని జీవాజీ అంతరిక్ష అధ్యయన కేంద్రం సూపరిండెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రకాశ్ గుప్తా సమాచారం అందించారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం..2025లో మొత్తం నాలుగు గ్రహణాలు ఏర్పడతాయి. వాటిలో రెండు సూర్యగ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు. 2025లో మొదటి గ్రహణం మార్చి 14, 2025న సంభవిస్తుంది. ఇక వచ్చే ఏడాది చివరి గ్రహణం సెప్టెంబర్ 21న ఏర్పడనుంది.
వీటిలో ఎన్ని గ్రహణాలు భారత్‌లో కన్పిస్తాయి?:వచ్చే ఏదాది మార్చి 14న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అదే నెలలో సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది. అయితే ఈ రెండు గ్రహణాలు మన దేశంలో కన్పించవు. ఆ తర్వాత ఏర్పడే మూడో గ్రహణం మన దేశంలో కన్పిస్తుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం. ఇక 2025లో చివరి గ్రహణం సూర్యగ్రహణం. ఇది కూడా మన దేశంలో కన్పించదు. అంటే వచ్చే ఏడాది సంభవించే నాలుగు గ్రహణాల్లో కేవలం ఒక్కటి మాత్రమే మన దేశంలో కన్పిస్తుంది.
ఈ సూర్య, చంద్ర గ్రహణాలు ఏ ఏ దేశాల్లో కన్పిస్తాయి?:
మొదటి గ్రహణం:వచ్చే ఏడాదిలో మొదటి గ్రహణం చంద్రగ్రహణం. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ గ్రహణం మార్చి 14న ఏర్పడుతుంది. అయితే ఇది పగటి పూట ఏర్పడటంతో మన దేశంలో కన్పించదు. ఈ గ్రహణం అమెరికా, పశ్చిమ యూరప్, పశ్చిమ ఆఫ్రికాతో పాటు ఉత్తర, దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో కన్పిస్తుంది.
రెండో గ్రహణం:2025 సంవత్సరంలో ఏర్పడే రెండో గ్రహణం సూర్యగ్రహణం. ఈ ఏడాదిలో ఇదే మొదటి సూర్యగ్రహణం కూడా. ఇది పాక్షిక సూర్యగ్రహణం. ఈ గ్రహణం మార్చి 29న ఏర్పడుతుంది. ఇది కూడా భారతదేశంలో కన్పించదు. దీంతో దీని ప్రభావం భారత్‌లో ఉండదు. అందువల్ల ఈ గ్రహణానికి మతపరమైన ప్రాముఖ్యత లేదు. కాబట్టి దీనికి సూతక్ కాలాలు కూడా వర్తించవు. అందువల్ల ఇది ఏ రాశిని ప్రభావితం చేయదని సమాచారం. అయితే ఈ సూర్యగ్రహణం ఉత్తర అమెరికా, గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం, యూరప్ మొత్తం, వాయువ్య రష్యాలో కన్పిస్తుంది.
మూడో గ్రహణం:రాబోయే సంవత్సరంలో మూడో గ్రహణం చంద్రగ్రహణం. ఇది 2025లో రెండో చంద్రగ్రహణం. ఈ గ్రహణం సెప్టెంబర్ 7-8 తేదీలలో సంభవిస్తుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం. ఇది మన దేశంలో కనిపించనుంది. ఈ చంద్రగ్రహణాన్ని అంటార్కిటికా, పశ్చిమ పసిఫిక్ మహాసముద్రం, ఆస్ట్రేలియా, ఆసియా, హిందూ మహాసముద్రం, ఐరోపాలో కూడా చూడొచ్చు.
నాలుగో గ్రహణం:2025లో చివరి గ్రహణం సూర్యగ్రహణం. ఇది వచ్చే ఏడాదిలో రెండో సూర్యగ్రహణం. ఈ గ్రహణం సెప్టెంబర్ 21-22 తేదీలలో సంభవిస్తుంది. ఇది పాక్షిక సూర్యగ్రహణం. ఇది కూడా భారత్‌లో కన్పించదు. దీంతో ఈ సూర్యగ్రహణం ప్రభావం కూడా భారత్‌లో ఉండదు. న్యూజిలాండ్, తూర్పు మెలనేషియా, దక్షిణ పాలినేషియా, పశ్చిమ అంటార్కిటికాలో ఈ గ్రహణం కన్పిస్తుంది.
సూతక్ కాలం అంటే?: శాస్త్రం ప్రకారం..సూర్య గ్రహణానికి 12 గంటల ముందు సూతక్ కాలం ప్రారంభమవుతుంది. గ్రహణ కాలం ముగిసిన తర్వాత ఇది ముగుస్తుంది. గ్రహణం కన్పించే ప్రదేశాలలో మాత్రమే ఈ సూతక్ కాలం వర్తిస్తుంది. అయితే వచ్చే ఏడాదిలో ఏర్పడే రెండు సూర్యగ్రహణాలూ మన దేశంలో కన్పించవు. కావున ఆ సమయంలో మనం సూతక్ కాలాన్ని కూడా పరిగణించాల్సిన అవసరం లేదు. దీంతో వచ్చే ఏడాదిలో రెండు సూర్యగ్రహణాలూ మన దేశంపై ప్రభావం చూపించవని తెలుస్తోంది. అందువల్ల ఇవి ఏ రాశిని ప్రభావితం చేయవని సమాచారం.
ఆకాశంలో అద్భుతం.. మీరు ఎప్పుడైనా 'బ్లాక్ మూన్' చూశారా?- ఇప్పుడు మిస్సైతే మళ్లీ ఎప్పటికో..!
సూర్యుని చెంతకు మానవ అస్త్రం- చరిత్ర సృష్టించిన 'పార్కర్ సోలార్ ప్రోబ్'
'విశ్వంలో డార్క్ ఎనర్జీ అనేదే లేదు- ఆ సిద్ధాంతాలు తప్పు'- వీడిన అతిపెద్ద మిస్టరీ!