Ola Electric Launched Two New Scooter Series:ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ తన రెండు కొత్త ఎలక్ట్రిక్ టూ-వీలర్ శ్రేణులను మంగళవారం మార్కెట్లో విడుదల చేసింది. డెలివరీ ఏజెంట్ల కోసం కంపెనీ ప్రతి లైనప్‌లో రెండు మోడల్స్‌ను చేర్చింది. కంపెనీ ఈ శ్రేణులను 'Ola S1 Z ', 'Ola Gig' పేరుతో తీసుకొచ్చింది. సిటీ రైడింగ్‌కు అనుకూలంగా వీటిని డిజైన్ చేశారు. ఈ స్కూటర్లు పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తాయి. ఇది ఓలా పవర్‌పాడ్‌ని ఉపయోగించి హోమ్ ఇన్వర్టర్‌గా కూడా పనిచేస్తుంది.
ఈ స్కూటర్ల బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే వీటి డెలివరీలు మాత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'X'లో పోస్ట్ చేశారు. ఈ శ్రేణుల్లోని స్కూటర్లు మార్చుకోగలిగే బ్యాటరీలను కలిగి ఉన్నాయి. ఈ రెండు శ్రేణుల్లో మొత్తం నాలుగు రకాలు ఉన్నాయి. వీటిలో మూడు స్కూటర్లు.. డ్యూయల్ 1.5 kWh బ్యాటరీ ప్యాక్స్‌తో వస్తున్నాయి. 'Ola Gig' మాత్రం కేవలం ఒకే 1.5 kWh బ్యాటరీతో వస్తుంది.
Ola S1 Z and Ola Gig శ్రేణుల ధరలు:
- 'Ola Gig' ధర: రూ. 39,999 (ఎక్స్-షోరూమ్)
- 'Ola Gig+' ధర: రూ. 49,999 (ఎక్స్-షోరూమ్)
- 'Ola S1 Z' ధర: రూ. 59,999 (ఎక్స్-షోరూమ్)
- 'Ola S1 Z+' ధర: రూ. 64,999 (ఎక్స్-షోరూమ్)
'Ola Gig', 'Ola Gig+' స్పెసిఫికేషన్స్:డెలివరీ ఏజెంట్ల కోసం ఈ ఈవీ స్కూటర్లను తీసుకొచ్చారు. ఇందులో గిగ్ వర్కర్ల తక్కువ దూర ప్రయాణానికి వీలుగా 'Ola Gig'ను రూపొందించారు. ఇది 1.5 kWh రిమూవబుల్ బ్యాటరీతో వస్తుంది. ఇది సింగిల్ ఛార్జ్‌పై 112 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని టాప్ స్పీడ్ 25 కి.మీ. ఇది బి2బి కొనుగోళ్లు, రెంటల్ కోసం అందుబాటులో ఉంటుంది.
ఇక 'Ola Gig+'ను దూర ప్రయాణాలను చేసే గిగ్ వర్కర్లకు అనుకూలంగా డిజైన్ చేశారు. ఇది 1.5kWh డ్యూయల్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తోంది. ఇది సింగిల్ ఛార్జ్‌తో 81 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మొత్తం రెండు బ్యాటరీలతో కలిపి 157 కిలోమీటర్లు వెళ్లొచ్చు. దీన్ని కూడా బి2బి కొనుగోళ్లు, రెంటల్స్ కోసం అందుబాటులోకి తేనున్నారు. అంతేకాకా ఈ ఓలా గిగ్ శ్రేణిలో యాప్-బేస్డ్ యాక్సెస్ ఉంటుంది. ఇక్కడ రైడర్స్ అన్‌లాక్, రైడ్ చేసేందుకు స్కాన్ చేయొచ్చు.