NHAI Rajmarg Yatra App: మనకి తెలియని కొత్త ప్రదేశానికి వెళ్లాలంటే రూట్ మ్యాప్ కచ్చితంగా ఉండాలి. ఫాస్టాగ్ రీఛార్జి చేసేందుకు మరో యాప్. జర్నీలో ఏవైనా సమస్యలు ఎదురైతే కంప్లైంట్ చేసేందుకు అప్పటికప్పుడు గూగుల్‌లో వెతకాల్సి వస్తుంది. ఇలా ఒక్కోదానికి ఒక్కో యాప్ కాకుండా అన్నింటికీ కలిపి ఒకే యాప్‌ను NHAI (జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ) తీసుకొచ్చింది. రూట్ మ్యాప్స్ దగ్గర నుంచి స్మార్ట్ అలర్ట్స్ వరకు అనేక ఫీచర్లు ఇందులో ఉండటంతో జాతీయ రహదారులపై ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. 'రాజ్‌మార్గ్‌యాత్ర' పేరుతో తీసుకొచ్చిన ఈ యాప్‌పై మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.
కీలక సమాచారం: జాతీయ రహదారులపై వెళ్తున్నప్పుడు ప్రయాణికులకు అవసరమయ్యే కీలక సమాచారం ఈ యాప్‌లో లభిస్తుంది. రెస్టారెంట్స్, పెట్రోల్ పంపులు, ఛార్జింగ్ స్టేషన్లు, హాస్పిటల్స్, ఏటీఎంలు, పోలీస్ స్టేషన్లు, పర్యటక ప్రదేశాల సమాచారం ఇందులో కన్పిస్తుంది. ఈ యాప్ వాతావరణ స్థితి, ట్రాఫిక్ అలర్ట్స్ కూడా ఇస్తుంది.
ఫిర్యాదులు అక్కడే:ప్రధాన రహదారులకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులుంటే ఈ యాప్‌లో రిపోర్ట్ చేయొచ్చు. ఇందుకోసం యాప్‌లో 'Report An Issue On NH' అనే ఆప్షన్ ఉంటుంది. దాని సాయంతో రహదారికి సంబంధించిన సమస్యను ఫొటో, వీడియోను యాడ్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. ఇందులో వచ్చిన ఫిర్యాదులపై స్పందించి ఎన్‌హెచ్‌ఏఐ చర్యలు తీసుకుంటుంది. ఇందులో మన కంప్లైంట్ స్టేటస్ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
ఫాస్టాగ్ సర్వీసెస్:ఈ రాజ్‌మార్గ్‌యాత్ర యాప్ నుంచి ఫాస్టాగ్‌కు సంబంధించిన సర్వీసులూ పొందొచ్చు. ఫాస్టాగ్ రీఛార్జి కోసం ఎన్‌హెచ్‌ఏఐ వివిధ బ్యాంకు పోర్టల్‌లతో కలసి పనిచేస్తోంది. కొత్త ఫాస్టాగ్ అప్లికేషన్, నెలవారీ పాస్‌లు, ఫాస్ట్ ట్యాగ్‌కు సంబంధించిన ఇతర సర్వీసులూ ఈ ప్లాట్‌ఫామ్‌పై లభిస్తాయి.
టోల్ ప్లాజా వివరాలు:మీరు వెళ్తున్న రహదారిలో ఉండే టోల్ ప్లాజాల సంఖ్య, వాటి పేర్లు, కట్టాల్సిన మొత్తం వివరాలు కూడా ఈ యాప్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం యాప్‌లో 'Toll Plaza Enroute' అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేసి మీరు బయల్దేరుతున్న ప్రాంతం, చేరాల్సిన గమ్యస్థానాన్ని ఎంటర్ చేసి సెర్చ్‌పై క్లిక్ చేస్తే మీకు కావాల్సిన టోల్ ప్లాజా వివరాలన్నీ అందులో కన్పిస్తాయి.