Bajaj New Chetak: ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ బజాజ్ ఆటో ప్రసిద్ధి చెందిన తన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త వెర్షన్‌ను లాంఛ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. కంపెనీ 2020లో 'బజాజ్ చేతక్ ఈవీ' స్కూటర్‌ను ప్రారంభించింది. కానీ ఆ సమయంలో ఈ స్కూటర్ సేల్స్ పెద్దగా లేవు. అయితే ఆ తర్వాత కంపెనీ కొత్త మోడల్స్‌ను తీసుకురావటంతో పాటు ధర తగ్గింపుల కారణంగా అమ్మకాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. దీంతో ఈ స్కూటర్ దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న మూడో ఎలక్ట్రిక్ స్కూటర్‌గా నిలిచింది.
ఈ నేపథ్యంలో కంపెనీ ఈవీసెగ్మెంట్లో తన వ్యాపారాన్ని మరింత వేగంగా విస్తరించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో మంచి ప్రజాదరణ లభించిన దాని చేతక్ కొత్త వెర్షన్‌ను లాంఛ్ చేయాలని చూస్తోంది. డిసెంబర్ 20 నాటికి ఈ కొత్త చేతక్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ఈ చేతక్ కొత్త వెర్షన్ సరికొత్త ఫీచర్లతో ఆకర్షణీయమైన లుక్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. ఫ్లోర్‌బోర్డ్ కింద బ్యాటరీ ప్యాక్‌ను ఉంచనున్నారు. దీంతో కార్గో స్పేస్ పెరగనుంది. ఈ స్కూటర్ సింగిల్ ఛార్జ్‌తో 123 కిలోమీటర్ల నుంచి 137 కిలోమీటర్ల రేంజ్‌ని ఇస్తుందని తెలుస్తోంది. కొత్త చేతక్‌లో తీసుకొచ్చిన మార్పుల కారణంగా ఎలక్ట్రిక్‌స్కూటర్ హ్యాండ్లింగ్, రైడ్ క్వాలిటీ మరింత మెరుగ్గా ఉండనుంది.
ధర: ధర విషయానికొస్తే.. ప్రస్తుతం బజాజ్ చేతక్ ధరలు రూ.96,000-రూ.1,29,000(ఎక్స్- షోరూమ్)గా ఉన్నాయి. ఇక ఈ కొత్త ఈవీ ధర వీటి కంటే కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.