National Space Day 2024: చంద్రయాన్-3 ప్రయోగం విజయంతో అంతరిక్ష పరిశోధనల్లో భారత్ కీర్తి పతాకాల్లో నిలిచింది. ఈ ప్రయోగం ద్వారా చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద దిగిన తొలి దేశంగా ఇండియా చరిత్ర సృష్టించింది. ఆ రికార్డుకు గుర్తుగా ఏటా ఆగస్టు 23వ తేదీని ప్రధాని మోదీ జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈరోజు మొట్ట మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ అంశాలపై నెల రోజుల నుంచి వేడుకలు కొనసాగుతున్నాయి.
ఈ ఏడాది థీమ్ ఏంటంటే?:'టచింగ్ లైవ్స్ వైల్ టచింగ్ మూన్- ఇండియాస్ స్పేస్ సాగా'(Touching Lives while Touching the Moon: India's Space Saga) అనే థీమ్‌తో ఈ ఏడాది నేషనల్ స్పేస్ డే వేడుకలు నిర్వహిస్తున్నారు.
చంద్రయాన్-3 ప్రయోగం:
- గతేడాది జూలై 14న చంద్రయాన్-3ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. మరుసటి రోజు, మొదటి కక్ష్యను పెంచే విన్యాసాలను విజయవంతంగా ప్రదర్శించారు.
- ఆగస్టు 1, 2023న, ట్రాన్స్‌లూనార్ ఇంజెక్షన్ విజయవంతంగా పనిచేసింది.
- ఆగస్టు 5న చంద్రయాన్-3ని చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు.
- ఆగస్ట్ 17, 2023న, ల్యాండర్ మాడ్యూల్ ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విజయవంతంగా వేరైంది.
- ఆగష్టు 23న, సాయంత్రం 6:04 గంటలకు, చంద్రయాన్-3 ల్యాండర్ ల్యాండింగ్ కోసం లక్ష్యంగా పెట్టుకున్న 4.5 కిలోమీటర్ల విస్తీర్ణంలోని మధ్యభాగాన్ని తాకింది. ఆ పాయింట్‌కి 300 మీటర్ల (985 అడుగులు) దూరంలో ల్యాండర్ ల్యాండ్ అయింది.
హిస్టరీ క్రియేట్ చేసిన భారత్:చంద్రయాన్-3 ప్రయోగం విజయంతో చంద్రుని సౌత్ పోల్‌పై కాలు మోపిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. అంతేకాకుండా చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా అడుగుపెట్టిన యునైటెడ్ స్టేట్స్, చైనా, రష్యా తర్వాత భారత్ నాల్గొవ దేశంగా అవతరించింది. 600 కోట్లకు పైగా అంచనా వ్యయంతో ఈ మిషన్ ప్రారంభమైంది. భారత్ తదుపరి మానవ సహిత చంద్ర యాత్రకు ప్రయత్నిస్తుందని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు.