WhatsApp AI Features :ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) రేసులో అడుగుపెట్టింది. వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్ యాప్‌ల్లో సరికొత్త ఏఐని ఇంటిగ్రేట్ చేసింది. లాలామా 3 లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఆధారంగా ఇది పని చేస్తుంది. చాట్‌జీపీటీ తరహాలోనే ఈ ఏఐ చాట్‌బాట్ ఏ ప్రశ్నకైనా చిటికెలో సమాధానం ఇస్తుంది. అంతేకాదు వాట్సప్‌లో రియల్‌టైమ్ ఇమేజ్‌లను, యానిమేషన్స్ను రూపొందించి ఇస్తుంది. ప్రస్తుతానికి ఇది కొంత మంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
"మీరు టెక్ట్స్ రూపంలో కమాండ్ ఇస్తే చాలు మెటా ఏఐ మీ కోసం ఇమేజ్ జనరేట్ చేసి ఇస్తుంది. అంతేకాదు దీనితో మీరు క్వాలిటీ మిస్ కాకుండా ఫొటోలను యానిమేట్ చేసుకోవచ్చు. వెబ్‌లో కూడా meta.ai సేవలు వినియోగించుకోవచ్చు’’ అని జుకర్‌బర్గ్ తెలిపారు. మెటా వెల్లడించిన దాని ప్రకారం, మనం ఊహించుకున్న చిత్రాన్ని టెక్ట్స్ రూపంలో ఏఐ అసిస్టెంట్‌కు తెలిపితే చాలు అదే ఇమేజ్‌ను జనరేట్ చేసి ఇస్తుంది. ఫొటోను GIFగా మార్చే ఫీచర్ కూడా ఇందులో ఉందని తెలిపింది. అంతేకాదు ఇది ప్రాంప్ట్‌లు, సూచనలను కూడా అందిస్తుందని మెటా చెబుతోంది.
ఈ ఏఐ ఫీచర్‌ను మరిన్ని దేశాలకు విస్తరిస్తున్నట్లు మెటా తెలిపింది. మన దేశంలోనూ కొందరు యూజర్లకు ఈ నయా ఏఐ ఫీచర్ దర్శనమిస్తోంది. వాట్సప్ చాట్ మెనూలో వివిధ రంగులతో కూడిన వృత్తాకారంలో మెటా ఏఐ ఐకాన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేస్తే ‘ఆస్క్ మెటా ఏఐ ఎనీథింగ్’ అంటూ ఓ పాప్‌అప్ ఓపెన్ అవుతుంది. కంటిన్యూపై క్లిక్ చేస్తే, మెటా ఏఐతో చాట్ మెనూ ఓపెన్ అవుతుంది. ఈ చాట్ మెనూలో మీరు అడిగిన ప్రశ్నలు అన్నింటికీ ఏఐ సమాధానం ఇస్తుంది.