iPhone SE 4 Launch Date:టెక్ దిగ్గజం యాపిల్ నుంచి కొత్త ప్రొడక్ట్ త్వరలో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ మేరకు యాపిల్ సీఈవో టిమ్ కుక్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో ఒక పోస్ట్ ద్వారా వెల్లడించారు. ఇందులో తన అప్‌కమింగ్ ప్రొడక్ట్ టీజర్‌ను రిలీజ్ చేయడంతో పాటు లాంఛ్ తేదీని కూడా ప్రకటించారు. అయితే ఇది యాపిల్ అప్‌కమింగ్ 'ఐఫోన్ SE 4' టీజర్ అని తెలుస్తోంది. ఈ సందర్భంగా దీనిపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.
టీజర్‌ను విడుదల చేసిన టిమ్ కుక్:టిమ్ కుక్ కొన్ని గంటల క్రితం తన 'X' ఖాతా ద్వారా ఒక పోస్ట్ షేర్ చేశారు. అందులో 7 సెకన్ల టీజర్ కనిపిస్తుంది. దీనిలో ఆపిల్ లోగో స్టన్నింగ్ లుక్‌లో మెరుస్తూ కనిపిస్తుంది. ఈ టీజర్‌తో టిమ్ కుక్ 'గెట్ రెడీ టూ మీట్ ఏ న్యూ మెంబర్ ఇన్ అవర్ ఫ్యామిలీ' అని రాసుకొచ్చారు. దీనితో పాటు అందులో బుధవారం, ఫిబ్రవరి 19, యాపిల్ లాంఛ్ అని కూడా పేర్కొన్నారు.
అంటే యాపిల్ ఫిబ్రవరి 19న తన కొత్త ప్రొడక్ట్‌ను లాంఛ్ చేయనున్నట్లు వెల్లిడించేందుకు ఈ విధంగా రాసుకొచ్చారు. అయితే ఆ కొత్త ప్రొడక్ట్ పేరును మాత్రం అందులో ప్రస్తావించలేదు. అయితే ఇటీవల రిలీజ్ అయిన కొన్ని నివేదికల ప్రకారం యాపిల్ త్వరలో తన చౌకైన ఐఫోన్ SE 4ను లాంఛ్ చేసేందుక సన్నాహాలు చేస్తోంది. దీంతో ఇప్పుడు టిమ్‌కుక్ రిలీజ్ చేసిన ఈ టీజర్ ఈ మోడల్‌దే అని టెక్ నిపుణులు భావిస్తున్నారు. దీంతో యాపిల్ ఫిబ్రవరి 19న ఐఫోన్ SE 4ను విడుదల చేయబోతోందని తెలుస్తోంది.