Instagram Launches Testimonials:ప్రస్తుతం సోషల్ మీడియా వీడియో క్రియేటర్లకు డబ్బు సంపాదించడానికి ప్రధాన వనరుగా మారింది. అలాంటి వాటిలో ఇన్‌స్టాగ్రామ్ ఒకటి. ఇది అత్యంత ప్రజాదరణతో కంటెంట్ క్రియేటర్లకు వీడియోలను అప్‌లోడ్ చేయడం ద్వారా వివిధ మార్గాల్లో డబ్బు సంపాదించే అవకాశాన్ని ఇస్తుంది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఒక కొత్త పద్ధతిని ప్రారంభించింది. దీని ద్వారా కంటెంట్ క్రియేటర్లు మునుపటి కంటే ఎక్కువ డబ్బును సులభంగా సంపాదించుకోవచ్చు. ఇందుకోసం 'టెస్టిమోనియల్స్' పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో అడ్వర్టైజింగ్ కోసం కొత్త ఫీచర్ వచ్చింది. ఇది కొత్త రకమైన భాగస్వామ్య ప్రకటన (Partnership Ad). దీనిలో వివిధ రకాల బ్రాండ్లకు సంబంధించిన ప్రొడక్ట్‌ను ప్రమోట్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించొచ్చు.
అయితే ఈ 'టెస్టిమోనియల్స్'లో కేవలం టెక్స్ట్ మాత్రమే ఉంటుంది. అంటే ఒక ప్రొడక్ట్‌ను ప్రమోట్ చేసేందుకు వీడియో చేయడానికి బదులుగా మీరు ఒక టెక్స్ట్ మెసెజ్‌ను రాయాలి. అది వీడియో కామెంట్ సెక్షన్లో పైన కన్పిస్తుంది. ఈ మేరకు 'టెస్టిమోనియల్స్'తో కూడిన ప్రకటనలకు సంబంధించి, ఇన్‌స్టాగ్రామ్ తన కొత్త యాడ్ ఫార్మాట్ టెక్స్ట్ ఆధారితంగా మాత్రమే ఉంటుందని, దీనిని బ్రాండ్‌లతో ఇప్పటికే చేసుకున్న ఒప్పందాలతో అనుసంధానించవచ్చని తెలిపింది.
ఒక బ్లాగ్ పోస్ట్‌లో మెటా తన కొత్త పార్టనర్షిప్ యాడ్ ఫార్మాట్ వివరాలను పంచుకుంది. ఈ పోస్ట్ ప్రకారం 'టెస్టిమోనియల్స్' అనేవి షార్ట్ కంటెంట్‌గా ఉంటాయి. అంటే దీనిలో ప్రొడక్ట్‌ను టెక్స్ట్ ద్వారా మాత్రమే ప్రచారం (ప్రొమోట్) చేస్తారు. దీంతో దీనికి సమయం కూడా చాలా తక్కువగానే పడుతుంది.