Google Photos Introduces AI Info:ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం భారీగా పెరుగుతోంది. ఇది దాదాపు అన్ని రంగాలకూ వ్యాపిస్తుంది. ప్రపంచం ఏఐ వెంట పరుగులు పెడుతున్న నేపథ్యంలో అన్ని కంపెనీలూ ఏఐ టూల్స్‌ను వినియోగిస్తున్నాయి. ఇలా ఏఐ టూల్స్ వినియోగం పెరుగుతున్న తరుణంలో సులువుగా ఏఐ సాయంతో ఫొటోలు, వీడియోలు రూపొందిస్తున్నారు.
దీంతో అసలు నిజమైన ఫొటో ఏదో? ఏఐ సాయంతో రూపొందించనవి ఏవో తెలుసుకోవడం కష్టంగా మారుతోంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు గూగుల్ ఫొటోస్ సిద్ధమైంది. ఇందుకోసం గూగుల్ ఫొటోస్‌లో ఏఐ ఇన్ఫో పేరుతో ఓ సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ఏఐ సాయంతో క్రియేట్ చేసిన ఫొటోస్ను సులభంగా గుర్తించేందుకు ఉపయోగపడుతుంది.
ఈ 'ఏఐ ఇన్ఫో' సదుపాయాన్ని తీసుకొచ్చినట్లు గూగుల్ తన బ్లాగ్ పోస్ట్‌లో పంచుకుంది. దీని సాయంతో ఏఐ ఫొటోలను ఈజీగా గుర్తించొచ్చని తెలిపింది. అంటే ఇకపై ఏఐ టూల్స్ ఉపయోగించి ఎడిట్ చేసే ఫొటోస్ను ఇట్టే కనిపెట్టేయొచ్చు. అయితే గూగుల్ తీసుకొచ్చిన ఏఐ టూల్స్ సాయంతో ఫొటోస్ ఎడిట్ చేస్తే మాత్రమే గుర్తించగలరని పేర్కొంది.