Google Incognito News :సాధారణంగా మనకు ఏవైనా సందేహాలు వస్తే, వాటిని తెలుసుకునేందుకు గూగుల్‌లో సెర్చ్ చేస్తాం. అప్పుడు మన బుక్ మార్క్స్, డౌన్లోడ్స్ సహా, సెర్చ్ హిస్టరీ అంతా గూగుల్‌లో నిక్షిప్తం అవుతుంది. అదే బ్రౌజర్‌ను ఇతరులు వాడితే, వాళ్లకు మన సెర్చ్ హిస్టరీ మొత్తం తెలిసిపోతుంది. దీనిని నివారించడానికే చాలా మంది ఇన్‌కాగ్నిటో మోడ్‌లోకి వెళ్లి బ్రౌజ్ చేస్తుంటారు. దీని వల్ల తమ ప్రైవసీకి ఎలాంటి భంగం కలగదని భావిస్తుంటారు. కానీ ఇది వాస్తవం కాదు. గూగుల్ మిమ్మల్ని ట్రాక్ చేస్తూనే ఉంటుంది. ఇదే విషయాన్ని ఇటీవల ఒప్పుకుంది కూడా.
నో ప్రైవేసీ
యూజర్ల ప్రైవసీ కోసం ఇన్‌కాగ్నిటో మోడ్ తీసుకొచ్చినట్లు అప్పట్లో గూగుల్ తెలిపింది. దీని వల్ల యూజర్ల వ్యక్తిగత భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లదని భరోసా ఇచ్చింది. అందుకే చాలా మంది యూజర్లు, తమ రహస్య శోధనల కోసం ఇన్‌కాగ్నిటో మోడ్ ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇది అంతా ఒక బూటకమని, యూజర్ యాక్టివిటీస్ అన్నింటినీ గూగుల్ చట్టవిరుద్ధంగా ట్రాక్ చేస్తోందని అమెరికాలో 5 బిలియన్ డాలర్లకు కేసు నమోదు అయ్యింది. దీనితో గూగుల్ ఈ ఆరోపణలు వాస్తవమేనని అంగీకరించింది. తాము యూజర్లకు తెలియకుండా వారి సెర్చ్ హిస్టరీని, బుక్ మార్క్స్‌ను, డౌన్లోడ్స్ను పూర్తిగా ట్రాక్ చేస్తున్నామని ఒప్పుకుంది.
ఇకపైనా ట్రాక్ చేస్తాం!
గూగుల్ తాజాగా తమ యూజర్లకు ఒక క్లారిటీ ఇచ్చింది. తమ కానరీ వెర్షన్లో (గూగుల్ లేటెస్ట్ ఫీచర్లు, అప్డేట్లు తెచ్చేటప్పుడు, వాటిని యూజర్లు, డెవలపర్లు టెస్ట్ చేయడం కోసం ఒక బేసిక్ వెర్షన్‌ను రిలీజ్ చేస్తుంది. దానినే కానరీ వెర్షన్ అంటారు.) ఇన్‌కాగ్నిటో మోడ్ ఉపయోగించినప్పటికీ, యూజర్ల డేటాను సేకరిస్తామని స్పష్టం చేసింది. కనుక యూజర్లు ఇన్‌కాగ్నిటో మోడ్ వాడకం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.