Festive Season Online Sales: దసరా, దీపావళి పండగల వేళ ఆన్‌లైన్ సేల్స్ జోరుగా సాగుతున్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఇ-కామర్స్ సంస్థలు తీసుకొచ్చిన ఫెస్టివ్ సేల్స్‌లో పెద్దఎత్తున సేల్స్ నమోదవుతున్నాయి. వీటిలో స్మార్ట్‌ఫోన్స్, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ముందు వరుసలో నిలుస్తున్నాయి. సెప్టెంబర్ 26న ఈ రెండు కంపెనీలు సేల్స్ మొదలుపెట్టగా తొలి వారంలోనే (అక్టోబర్ 2 వరకు) సుమారు రూ.54వేల కోట్ల విలువైన అమ్మకాలు జరిగినట్లు డాటుమ్ ఇంటెలిజెన్స్ అనే సంస్థ నివేదిక పేర్కొంది. ఫెస్టివల్ సీజన్ సందర్భంగా మరికొన్ని రోజుల పాటు ఈ సేల్స్ కొనసాగనున్నాయి.
గతేడాదితో పోలిస్తే తొలి వారంలో విక్రయాలు 26 శాతం మేర పెరిగినట్లు సదరు నివేదిక తెలిపింది. మొత్తం అమ్మకాల్లో దాదాపు 60 శాతం వాటా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులదే కావడం గమనార్హం. వీటిల్లో మొబైల్ ఫోన్ల వాటా 38 శాతం కాగా.. ఇతర ఎలక్ట్రానిక్, కన్జూమర్ డ్యూరబుల్స్ వాటా 21 శాతంగా ఉంది. ఈ సేల్స్‌లో ఐఫోన్ 15తో పాటు, పాత ఐఫోన్ మోడళ్లకు మంచి గిరాకీ ఏర్పడినట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. తక్కువ ధరలో తీసుకొచ్చిన శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్‌ఈ ఫోన్‌కు సైతం మంచి డిమాండ్ నెలకొందని పేర్కొంటున్నారు.