Indian GDP Growth In 2024-25 : భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుని, స్థిరంగా కొనసాగుతోందని ఆర్‌బీఐ నివేదిక పేర్కొంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 6.6 శాతం వరకు పెరగవచ్చని అంచనా వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ మళ్లీ పెరగడం; ప్రభుత్వ పెట్టుబడి, వ్యయాలు వృద్ధి చెందడం; సేవా రంగంలో ఎగుమతులు బాగుండడం ఇందుకు కారణమని పేర్కొంది.
ఆర్‌బీఐ సోమవారం ఫైనాన్సియల్ స్టెబిలిటీ రిపోర్ట్ - డిసెంబర్ 2024 సంచికను విడుదల చేసింది. దీనిలో భారత ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవం, ఆర్థిక స్థిరత్వానికి ఉన్న ముప్పుల గురించి ఫైనాన్సియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎఫ్‌ఎస్‌డీసీ) సబ్-కమిటీ వేసిన అంచనాల వివరాలు ఉన్నాయి.
'తగినంత మూలధనం, బలమైన లాభదాయకతతో పాటు, నిరర్థక ఆస్తులు తగ్గడం, లిక్విడ్ బఫర్‌లు పెరగడం మొదలైన కారణాల వల్ల షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు పటిష్ఠం అయ్యాయి. ఆస్తులపై వచ్చే ఆదాయం (ఆర్‌ఓఏ), ఈక్విటీలపై వచ్చే రాబడి (ఆర్‌ఓఈ) దశాబ్దకాల గరిష్ఠ స్థాయిల్లో ఉన్నాయి. అంతేకాదు స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి కూడా అనేక సంవత్సరాల కనిష్ఠానికి పడిపోయింది' అని ఆర్‌బీఐ నివేదిక పేర్కొంది.
తీవ్ర ప్రతికూల పరిస్థితులు, ఒత్తిళ్లు ఎదురైనప్పటికీ చాలా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు (SCBs) తగినంత మూలధన బఫర్ కలిగి ఉన్నాయని ఆర్‌బీఐ పేర్కొంది. వాస్తవానికి రెగ్యులేటరీలు విధించిన కనీస పరిమితి కంటే మించి ఎస్‌సీబీల వద్ద క్యాపిటల్ బఫర్స్ ఉన్నాయని తెలిపింది. అలాగే మ్యూచువల్ ఫండ్స్, క్లియరింగ్ కార్పొరేషన్లు కూడా తీవ్ర ఒత్తిళ్లు వచ్చినప్పటికీ, అవి తిరిగి పుంజుకున్నాయని వెల్లడించింది.
వృద్ధి తగ్గుతోంది!
2023-24 మొదటి ఆర్థభాగంలో దేశ వాస్తవ జీడీపీ వృద్ధి 8.2 శాతంగా ఉంది. రెండో అర్థభాగంలో ఈ వాస్తవ డీజీపీ వృద్ధి 8.1 శాతానికి చేరింది. కానీ వాటితో పోల్చితే 2024-25 మొదటి అర్ధ భాగంలో దేశ వాస్తవ జీడీపీ వృద్ధి 6 శాతానికి తగ్గిపోయిందని ఆర్‌బీఐ నివేదిక స్పష్టం చేసింది.
వృద్ధికి ఢోకా లేదు!
ఇటీవల కొంత మేరకు ఆర్థిక వృద్ధి క్షీణించినప్పటికీ, భవిష్యత్ మాత్రం ఆశాజనకంగా ఉంది. ముఖ్యంగా ప్రజా వినియోగం, పెట్టుబడులు పెరగడం, సేవా రంగంలో ఎగుమతులు ఉండడం, అలాగే ఆర్థిక పరిస్థితులు సరళంగా ఉండడం వల్ల 2024-25 మూడు, నాలుగు త్రైమాసికాల్లో భారత ఆర్థిక వృద్ధి పుంజుకునే అవకాశం ఉందని ఆర్‌బీఐ అంచనా వేసింది.
ఖరీఫ్, రబీ సీజనల్లో ఆహార ధాన్యాల ఉత్పత్తి బాగా ఉంటే, దేశంలో బఫర్ జోన్‌లు పెరిగి, ఆహార ధాన్యాల ధరలు దిగివస్తాయని, ఫలితంగా ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. కానీ ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడితే ఈ అంచనాలు తారుమారు అయ్యే ప్రమాదముందని తెలిపింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ సరఫరా గొలుసులు విచ్ఛినం కావడం మొదలైనవి వస్తు, సేవల ధరలపై తీవ్ర ప్రభావం చూపించవచ్చని విశ్లేషించింది.