Why Do We Need Antivirus Software : ప్రస్తుతం కాలంలో ప్రతీదీ డిజిటల్ మయం అయిపోతోంది. ఫోన్ లేదా కంప్యూటర్ లేకుండా మోడ్రన్ శ్రామిక శక్తి పని చేయడం దాదాపు అసాధ్యం అనడంలో అతిశయోక్తి లేదు. పెద్దలతో పాటు పిల్లలూ అనేక రకాలుగా డిజిటల్ పరికరాలను వినియోగిస్తున్నారు. అందులో ముఖ్యంగా ఫోన్, కంప్యూటర్ వీనియోగం ఎక్కువైంది. అందుకు తగ్గట్లుగా సైబర్ నేరాలూ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో యూజర్లు చేసే ప్రతి క్లిక్ వెనుక ప్రమాదం పొంచి ఉంటోంది. అనేక రకాలుగా వైరస్, మాల్వేర్, ర్యాన్సమ్‌వేర్‌లు డిజిటల్ డివైజ్‌లలోకి చేరి యూజర్లకు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తున్నాయి. వీటిని ఆయుధంగా చేసుకుని సైబరాసురులు యూజర్ల వ్యక్తిగత డేటాకు భంగం కలిగిస్తున్నారు. యుజర్లు అకౌంట్లలోకి చొరబడి వారి డబ్బులు చోరీ చేస్తున్నారు.
వీటన్నింటికీ చెక్ పెట్టాలంటే మన డిజిటల్ డివైజ్‌లలో శక్తిమంతమైన యాంటీవైరస్/యాంటీమాల్వేర్ సాఫ్ట్వేర్ ఉండటం చాలా ముఖ్యం. అసలు యాంటీవైరస్ /యాంటీమాల్వేర్ సాఫ్ట్వేర్ అంటే ఏమిటి? ఇది ఏ విధంగా యూజర్లకు ఉపయోగపడుతుంది? దీని వల్ల యూజర్లకు జరిగే లాభలేంటి? ఇలాంటి సాఫ్ట్వేర్లు ఉపయోగిస్తున్నప్పుడు ఏఏ అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
యాంటీవైరస్/యాంటీమాల్వేర్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి?
యాంటీవైరస్/యాంటీమాల్వేర్ అంటే ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్. మీ కంప్యూటర్లో ఉన్న వైరస్లు, మాల్వేర్లను గుర్తిస్తుంది. అనంతరం వాటిని మిగతా సాఫ్ట్వేర్ల నుంచి వేరు చేసి తొలగిస్తుంది. వాటి వల్ల మీ కంప్యూటర్‌కు హాని కలిగకుండా నిరోధిస్తుంది.
అన్ని రకాల హానికరమైన సాఫ్ట్వేర్లను మాలిషియస్ సాఫ్ట్వేర్ లేదా మాల్వేర్ అంటారు. ఈ పదాన్ని అన్నింటికీ కామన్‌గా ఉపయోగిస్తారు. కానీ వైరస్ అనేది ఒక రకమైన మాల్వేర్ మాత్రమే. ఇదే కాకుండా ట్రోజన్స్, స్పైవేర్, ర్యాన్సమ్వేర్, స్కేర్‌వేర్ అని అనేక రకాల మాల్వేర్లు ఉంటాయి.
అయితే యాంటీవైరస్ సాఫ్ట్వేర్, వైరస్‌లతో పాటు కొన్ని రకాల మాల్వేర్లను మాత్రమే అడ్డుకుటుంది. కానీ యాంటీ-మాల్వేర్ సాఫ్ట్వేర్ అన్ని రకాల మాల్వేర్ల నుంచి కంప్యూటర్ను కాపాడుతుంది. చాలా క్లిష్టమైన సైబర్ అటాక్‌ల నుంచి కూడా రక్షణ ఇస్తుంది. యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అనేది కంప్యూటర్ కొన్నప్పుడు ఇన్‌బిల్ట్‌గా వస్తుంది. యాంటీమాల్వేర్ మాత్రం యాడ్ ఆన్‌గా అందుబాటులో ఉంది.
యాంటీవైరస్ సాఫ్ట్వేర్ వల్ల ఉపయోగమేంటి?
దీనివల్ల యూజర్లకు ముఖ్యమైన డాక్యుమెంట్లు, బ్యాంకింగ్ వివరాలు, పర్సనల్ ఫొటోలు సైబరాసురుల చేతుల్లోకి వెల్లకుండా జాగ్రత్త పడొచ్చు. ఇలాంటి సాఫ్ట్వేర్లు మన కంప్యూటర్లోకి రాకుండా చూసుకుంటాయి. వచ్చినా మన డేటాకు భంగం కలగకుండా వాటిని గుర్తించి తొలగిస్తాయి.
ఎలాంటి యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఎంచుకోవాలి?
ఇలాంటి సాఫ్ట్వేర్లు వివిధ రకాల కంప్యూటర్ వినియోగాలకు వేరు వేరుగా ఉంటాయి. కంప్యూటర్లో ఎలాంటి పనిచేస్తున్నారు, ఎంత రిస్క్ పొంచి ఉంది అనే దానిపై మీరు తీసుకునే యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ ఆధారపడి ఉంటుంది. అయితే అన్ని రకాల సాఫ్ట్వేర్లు ఒకేసారి కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసి వాడితే ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే అవసరానికి తగిన యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఎంచుకోవాలి.
యాంటీవైరస్/మాల్వేర్ సాఫ్ట్‌వేర్‌లో ఫీచర్లు మస్ట్!
చాలా రకాల సైబర్ అటాక్స్ ఇంటర్నెట్ బ్రౌజింగ్ ద్వారా వస్తాయి. కనుక ఫిషింగ్(ఒక రకమైన సైబర్ అటాక్) నుంచి రక్షణ ఇచ్చే యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ ఉండటం ముఖ్యం. అంతేకాకుండా బ్రౌజింగ్‌లో స్పైవేర్, యాడ్వేర్ కూడా సమస్యలే. వీటి నుంచి కూడా కంప్యూటర్ను కాపాడే యాంటీ వైరస్ సాఫ్ట్వేర్లు తీసుకోవాలి. చివరగా ఆన్ డిమాండ్ మాల్వేర్, వల్నరబిలిటీ స్కాన్ చేసే సాఫ్ట్వేర్లు తీసుకోవడం అవసరం. ఇలాంటి ఫీచర్లు ఉంటే మీ డేటా సురక్షితంగా ఉంటుంది. మీరు ఎంచుకున్న యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ ట్రెండింగ్ త్రెట్లకు చెక్ పెట్టేలా ఉంటే మంచిది.