తెలంగాణ

telangana

ETV Bharat / technology

'తెలియని వ్యక్తులు కాల్ చేసినా ఇక పేరు కనిపిస్తుంది!'- త్వరలోనే డీఫాల్ట్​ 'కాలర్​ ఐడీ' ఫీచర్​! - DEFAULT CALLER ID FEATURE

డీఫాల్ట్​ 'కాలర్​ ఐడీ' ఫీచర్​ను​ త్వరలోనే తీసుకురావాలని టెలికాం కంపెనీలకు కేంద్రం సూచన

Default Caller Id Feature
Default Caller Id Feature (Getty Image)

By ETV Bharat Telugu Team

Published : Jan 16, 2025, 6:01 PM IST

Default Caller Id Feature :గుర్తు తెలియని వ్యక్తుల నుంచి మనకు ఫోన్ కాల్ వస్తే, నంబరు మాత్రమే కనిపిస్తుంది. పేరు కనిపించదు. ఇకపై తప్పకుండా నంబరుతో పాటు పేరు కూడా కనిపించేలా ఫీచర్‌ను అందుబాటులోకి తేవాలని టెలికాం కంపెనీలను కేంద్ర టెలికాం శాఖ కోరుతోంది. సాధ్యమైనంత త్వరగా ఈ దిశగా ఏర్పాట్లు చేయాలని టెలికాం కంపెనీలపై ఒత్తిడిని పెంచుతోంది. 'కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్' (సీఎన్‌ఏపీ) పేరుతో ఈ సర్వీసును అందుబాటులోకి తేవాలని టెలికాం కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినట్లు తెలిసింది. దీనివల్ల స్పామ్, స్కామ్ కాల్స్ బెడద నుంచి టెలికాం యూజర్లు బయటపడతారని సర్కారు భావిస్తోంది.

ట్రయల్ దశలో సీఎన్‌ఏపీ ఫీచర్
గత వారం టెలికాం కంపెనీల అధికార ప్రతినిధులతో కేంద్ర టెలికాం శాఖ నిర్వహించిన సమావేశంలోనూ 'కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్' (సీఎన్‌ఏపీ) సర్వీసుపై ప్రధానంగా చర్చ జరిగిందని సమాచారం. వీలైనంత త్వరగా ఈ ఫీచర్‌ను వినియోగదారులు అందరికీ అందుబాటులోకి తేవాలని ఈ సందర్భంగా టెలికాం కంపెనీల ప్రతినిధులకు టెలికాం శాఖ ఉన్నతాధికారులు నిర్దేశించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ ఫీచర్​పై ట్రయల్స్ చేస్తున్నట్లు టెలికాం కంపెనీ ప్రతినిధులు తెలిపారు. 'దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య జరిగే ఇన్‌కమింగ్ కాల్స్‌లో ఈ ఫీచర్‌ను పరీక్షిస్తున్నాం. దాని ప్రయోగాత్మక అమలు సవ్యంగానే ఉందని నిర్ధరించుకున్న తర్వాత, దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తాం. అయితే సాంకేతిక కారణాల వల్ల 2జీ నెట్‌వర్క్‌పై పనిచేసే ఫోన్లకు సీఎన్‌ఏపీ సర్వీసును అందుబాటులోకి తీసుకురావడం కష్టం. ఒక టెలికాం సర్కిల్ పరిధి నుంచి మరో టెలికాం సర్కిల్ పరిధిలోకి ఇన్ కమింగ్ కాల్స్ వెళ్లినప్పుడు ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందనేది పరీక్షించాల్సి ఉంది' అని గత వారం టెలికాం శాఖ సమావేశంలో పాల్గొన్న ఓ కంపెనీ ప్రతినిధి తెలిపారంటూ ఒక మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది.

ట్రాయ్ సిఫార్సు
భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) 2022లోనే సీఎన్‌ఏపీ సర్వీసును త్వరలో అమల్లోకి తీసుకురావలని కేంద్ర టెలికాం శాఖకు సిఫార్సు చేసింది. అందుకే దాని అమలు దిశగా టెలికాం శాఖ ముమ్మర కసరత్తు చేస్తోంది. ఈ ఫీచర్ అమలుకు అనుగుణంగా ఫోన్లను తీసుకురావాలని తయారీ కంపెనీలకు ఇప్పటికే టెలికాం శాఖ స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. +91 నంబరు లేకుండా వచ్చే ఫోన్ నంబర్లను విదేశీ నంబర్లుగా లేబుల్ చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. ఇప్పటికే ఈ తరహా ఫీచర్‌ను ఎయిర్​టెల్ అమలు చేస్తోంది.

ప్రైవసీకి భంగం కలుగుతుందని ఆందోళన
ఫోన్ కాల్ చేసేవారి పేరును చూపించే ఫీచర్‌పై పలువురు టెలికాం రంగ పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల వ్యక్తుల ప్రైవసీ (గోప్యత)కు భంగం కలుగుతుందని అంటున్నారు. కొంతమంది తమ పేర్లు ఇతరులకు కనిపించకూడదనే భావనతో ఉంటారని, అలాంటి వారికి అసౌకర్యంగా ఉంటుందని చెబుతున్నారు. ఫోన్ కాలర్ పేర్లను చూపించే ఫీచర్లతో చాలా మొబైల్ యాప్స్ ఇప్పటికే అందుబాటులో ఉన్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. కాలర్ పేరును చూడదల్చిన వారు అలాంటి యాప్స్‌ను వినియోగించుకుంటారని అభిప్రాయపడుతున్నారు. తప్పకుండా కాలర్ పేరును చూపించే ఫీచర్ అక్కర లేదనే అభిప్రాయం పలువురిలో వ్యక్తమవుతోంది.

ABOUT THE AUTHOR

...view details