ChatGPT AI Powered Search Engine :చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ (OPenAI) కొత్తగా ఓ సెర్చ్ ఇంజిన్‌ను తీసుకువచ్చింది. ఇది పూర్తిగా కృత్రిమ మేధ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్)తో పనిచేస్తుంది. ఇది గూగుల్‌కు గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల టాక్.
ఇంత వరకు ఏఐ ఆధారిత చాట్‌బాట్ సేవలను అందిస్తున్నఓపెన్ ఏఐ, ఇప్పుడు గూగుల్ గుత్తాధిపత్యానికి చెక్ పెట్టేందుకు ‘సెర్చ్‌జీపీటీ’ పేరుతో కొత్త సెర్చింజిన్‌ను ప్రకటించింది. ఈ ఏఐ ఆధారిత సెర్చింజిన్ ఇంటర్నెట్‌లోని రియల్‌టైమ్ డేటాను యూజర్లకు అందిస్తుంది. ప్రస్తుతానికి ఇది ప్రోటోటైప్ స్టేజ్‌లోనే ఉందని ఓపెన్‌ఏఐ స్పష్టం చేసింది. పరిమిత గ్రూప్, పబ్లిషర్లతో దీన్ని పరీక్షిస్తున్నామని తెలిపింది.
గూగుల్‌దే గుత్తాధిపత్యం - కానీ
సెర్చింజిన్‌ల విషయంలో సుమారు 91% వాటా గూగుల్ కంపెనీదే. అయితే 'ఓపెన్ఏఐ' కంపెనీ తమదైన ఏఐ ఆధారిత సెర్చింజిన్‌ను తీసుకొచ్చినట్లు ప్రకటించిన వెంటనే, స్టాక్ మార్కెట్లో గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్ షేర్లు 3 శాతం వరకు నష్టపోయాయి. ఓపెన్‌ఏఐ తీసుకొచ్చిన ఈ ఏఐ ఆధారిత సెర్చింజిన్ - గూగుల్, బింగ్ వంటి సాధారణ సెర్చింజిన్ల లాగా కాకుండా, లేటెస్ట్ సమాచారాన్ని ఇస్తూనే, సంబంధిత లింక్‌లను కూడా జోడిస్తుంది. ఉదాహరణకు మీరు మ్యూజిక్ ఫెస్ట్‌ల గురించి సమాచారం అడిగితే, ఆ వివరాలను ఇవ్వడమే కాకుండా, ఆ కంటెంట్‌ను ఎక్కడి నుంచి తీసుకున్నది కూడా తెలియజేస్తుంది. యూజర్లు అడిగే అనుబంధ ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇస్తుంది. అయితే ఈ సెర్చ్‌జీపీటీ ఎలా పనిచేస్తుందో పరీక్షించడానికి, కంపెనీ దీన్ని తొలుత కొంత మంది పబ్లిషర్లకు అందించనుంది.