ChatGPT Faces Outage: ఓపెన్ ఏఐ తీసుకొచ్చిన ఏఐ ఆధారిత చాట్ జీపీటీ పెద్ద సమస్యలో చిక్కుకున్నట్లు కన్పిస్తోంది. మైక్రోసాఫ్ట్ మద్దతుగల కంపెనీ ప్రసిద్ధ చాట్‌బాట్ చాట్‌జీపీటీ ప్రస్తుతం అందుబాటులో లేదు. దీంతో తాము పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నామని కంపెనీ తెలిపింది. సాంకేతిక సమస్యల కారణంగా అకస్మాత్తుగా ఇది పనిచేయకుండా ఆగిపోయింది. దీంతో వేలాది మంది వినియోగదారులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
చాట్జీపీలో సమస్యను తెలుసుకునేందుకు చెక్ చేస్తున్నట్లు తెలిపింది. వీలైనంత త్వరగా దీన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. అవుట్‌టేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ Downdetector.com ప్రకారం భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో దాదాపు 20,000 మంది వినియోగదారులకు చాట్‌జీపీటీలో సమస్య కారణంగా ఆటంకం ఏర్పడింది.
ప్రస్తుత కాలంలో చాట్‌జీపీటీ గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఏదైనా విషయం కోసం టైప్ చేయాలన్నా, దేని గురించైనా తెలుసుకోవాలన్నా చాట్ జీపీటీలోనే సెర్చ్ చేస్తున్నారు. ఇది యూజర్ అడిగిన ప్రశ్నలను అర్థం చేసుకుని పూర్తి వివరాలతో చిటికెలో సమాధానాన్ని సిద్ధం చేసి అందజేస్తుంది. ఇలా వినియోగదారులకు కావాల్సిన సమాచారాన్ని క్షణాల్లో అందిచడంతో టెక్ ప్రియులు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.