తెలంగాణ

telangana

ETV Bharat / technology

పిల్లలు ఇంటిని చిందరవందర చేస్తున్నారా? ఈ రోబో వాక్యూమ్ క్లీనర్ ఉంటే చాలు - క్షణాల్లో అంతా క్లీన్! - CES 2025 NEW ROBOT VACUUM CLEANER

CESలో లేటెస్ట్ రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్​ - క్షణాల్లో ఇళ్లంతా క్లీన్ - సీసీ కెమెరాగానూ వాడుకోవచ్చు!

Robot Vacuum Cleaner
Robot Vacuum Cleaner (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jan 8, 2025, 12:09 PM IST

CES 2025 New Robot Vacuum Cleaner :మీ పిల్లలు ఆడుకుంటూ ఇళ్లంతా చిందరవందర చేస్తున్నారా? వాళ్ల వస్తువులు, ఆటబొమ్మలు సర్దుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లోకి లేటెస్ట్ రోబోటిక్​ వాక్యూమ్ క్లీనర్ వచ్చేసింది. ఇది క్షణాల్లో ఇంటినంతటికీ ఊడ్చేసి, అంతా క్లీన్​గా చేసేస్తుంది. పైగా దీనిని సీసీ కెమెరాగానూ వాడుకోవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్​గా ఉంది కదా! మరెందుకు ఆలస్యం దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి.

సరికొత్త సాంకేతిక ఉత్పత్తులను ఆవిష్కరించడంలో చైనా కంపెనీలు సత్తా చాటుకుంటున్నాయి. ఈ క్రమంలోనే చైనా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ‘రోబో రాక్’ కంపెనీ సరికొత్త వ్యాక్యూమ్ క్లీనర్‌ను తయారు చేసింది. దానిపేరు ‘సారోస్ జెడ్70’. దీన్ని తాజాగా అమెరికాలోని లాస్ వెగాస్‌లో జరిగిన కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్)లో ప్రదర్శించారు. ఏడేళ్ల సుదీర్ఘ రీసెర్చ్ అనంతరం ‘సారోస్ జెడ్70’ను తయారు చేశామని రోబో రాక్ కంపెనీ వెల్లడించింది. ఈ వ్యాక్యూమ్ క్లీనర్‌ను వాడిన తర్వాత ఫోల్డ్ చేసి పక్కన పెట్టొచ్చని తెలిపింది. ఇంట్లో చిందరవందరగా పడి ఉన్న వస్తువులన్నీ సునాయాసంగా తీసి పక్కన పెట్టేందుకు అనువుగా ‘సారోస్ జెడ్70’కు చక్కటి రోబోటిక్ హ్యాండ్ ఉంది. ఇది నలువైపులా ఈజీగా తిరుగుతుంది. ఫలితంగా తేలికపాటి ఇంటి సామాన్లను సర్దే పనులను కూడా దీనితో చేయించుకోవచ్చు.

క్షణాల్లో అంతా క్లీన్​
‘సారోస్ జెడ్70’ వ్యాక్యూమ్ క్లీనర్ మొత్తం మూడు విడతల్లో తన పనిని కానిచ్చేస్తుంది. తొలుత అది గదిని ఊడుస్తుంది. ఈక్రమంలో తాను లిఫ్ట్ చేయగలిగిన వస్తువులేమైనా ఉన్నాయా? లేదా? అనేది గుర్తిస్తుంది. దాన్ని తన మెమొరీలో నిక్షిప్తం చేసుకుంటుంది. గదిని ఊడ్చడం పూర్తయిన తర్వాత, అంతకుముందు తాను గుర్తించిన తేలికపాటి వస్తువులను లిఫ్ట్ చేసి మనం సూచించిన చోట పెడుతుంది. గరిష్ఠంగా 300 గ్రాముల వరకు బరువు ఉండే వస్తువులను ఇది లిఫ్ట్ చేయగలదు. తదుపరిగా తాను వస్తువులను లిఫ్ట్ చేసిన ప్రాంతాల్లో నేలపై దుమ్మూధూళి ఉంటే అక్కడ వ్యాక్యూమ్ క్లీనింగ్ చేస్తుంది. దీని ధర దాదాపు రూ.1.71 లక్షలు (2వేల డాలర్లు) ఉంటుందని అంచనా వేస్తున్నారు. ‘సారోస్ జెడ్70’ను ఈ ఏడాది ఏప్రిల్‌లో అమెరికా మార్కెట్‌లోకి విడుదల చేసే అవకాశం ఉంది.

‘సారోస్ జెడ్70’ ఫీచర్స్

  • ‘సారోస్ జెడ్70’ వ్యాక్యూమ్ క్లీనర్ బరువు దాదాపు 4.98 కేజీలు ఉంటుంది.
  • ఇందులో ‘స్టార్ సైట్’ సెన్సార్లు, కెమెరాలు అమర్చి ఉంటాయి. వాటి ద్వారా ఇది తన చుట్టూ ఉన్న పరిసరాలను చూస్తుంది. వస్తువులను స్పర్శించి, వాటిని లిఫ్ట్ చేస్తుంది.
  • మడత పెట్టగానే ఇందులో ఉన్న కెమెరాలు ఆఫ్ అవుతాయి. అయితే ఇంట్లోని సీసీ కెమెరాల్లా దీన్ని వాడుకోవాలని భావిస్తే ఆ కెమెరాలను ఆన్ చేసి ఉంచే ఆప్షన్ అందుబాటులో ఉంది. ఈ కెమెరాలు రికార్డు చేసే దృశ్యాలు అందులోనే స్టోర్ అవుతాయి. దాన్ని ఇతరులు హ్యాక్ చేసి తస్కరించే అవకాశమే ఉండదు.
  • ‘సారోస్ జెడ్70’ వ్యాక్యూమ్ క్లీనర్‌కు అడుగు భాగంలో గుండ్రటి బేస్ ఉంటుంది. దానిపై రోబోటిక్ ఆర్మ్ ఉంటుంది. ఐదు రకాల యాంగిల్స్‌లో అది తిరగగలదు. రోబోటిక్ ఆర్మ్‌లో చైల్డ్ లాక్ ఆప్షన్, సేఫ్టీ స్టాప్ బటన్ ఉన్నాయి. పిల్లలు ఉన్నచోట వీటిని ఆన్ చేసుకోవచ్చు.

ABOUT THE AUTHOR

...view details