Sex And Pregnancy In Space :అంతరిక్షం - మనిషికి ఎంతో ఆసక్తి కలిగిన అంశం. దానిపై ఇప్పుడు ఎన్నెన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. భారత దేశం కూడా గగన్‌యాన్ మిషన్‌పై దృష్టి పెట్టింది. భారత అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు ముమ్మర కసరత్తు జరుగుతోంది. అంతరిక్షంలోని గ్రహాలపై భారత్ సహా ఎన్నో దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. అంగారక గ్రహం(మార్స్) భూమిని తలపించేలా ఉంటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో మానవాళి పరిశోధనలకు మైదానంగా మారిన అంతరిక్షంపై మనిషి మెదడులో చాలా ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అక్కడ వ్యోమగాముల మధ్య లైంగిక సంపర్కం సాధ్యమా? మహిళలకు గర్భధారణ జరుగుతుందా? అంతరిక్షంలో పుట్టే శిశువులు ఎలా ఉంటారు? అనే వాటికి సమాధానం తెలుసుకోవాలనే కుతూహలం చాలా మందికి ఉంటుంది. ఆ వివరాలను చూద్దాం.
అంతరిక్షంలో ప్రెగ్నెన్సీ సాధ్యమా?
మహిళా వ్యోమగాములు అంతరిక్షంలో గర్భం దాల్చడం సాధ్యమా? అంటే - చాలా వరకు సాధ్యమే. అయితే అంతరిక్షంలోని విభిన్నమైన వాతావరణ పరిస్థితుల వల్ల గర్భం దాల్చిన మహిళకు, ఆమె కడుపులోని పిండానికి ముప్పు పొంచి ఉంటుంది. గురుత్వాకర్షణ లేకపోవడం, భారీ రేడియేషన్ వల్ల కడుపులోని పిండం ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కనుక ఆరోగ్యపరమైన సవాళ్లను ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అంతరిక్ష యాత్రలో ఉండే వ్యోమగాములు సెక్స్‌లో పాల్గొనే అంశంపై ప్రస్తుతానికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా)కు ఒక నిర్దిష్ట విధానమేదీ లేదు. ఇప్పటి వరకు అంతరిక్ష యాత్రల్లో నాసా వ్యోమగాములు ఎవరూ ఆ పని చేయలేదు!