Black Moon: ఆకాశంలో ఇవాళ రాత్రి ఓ అద్భుతం సాక్షాత్కారం కాబోతుంది. ఇప్పటి వరకు మనకు చంద్రుడు తెల్లగా పాలరాతిలా మెరుస్తూ ఉంటాడని తెలుసు. అయితే కేవలం తెలుపు రంగులో మాత్రమే కాకుండా రెడ్, ఎల్లో, పింక్ వంటి ఎన్నో రంగుల్లో కన్పించడం కూడా మనం చూశాం. అయితే ఇప్పుడు మాత్రం అరుదైన 'బ్లాక్ మూన్'ను చూడబోతున్నాం.
బ్లాక్ మూన్ ఎప్పుడు కన్పిస్తుంది?:US నావల్ అబ్జర్వేటరీ ప్రకారం.. డిసెంబర్ 30న ఆకాశంలో 'బ్లాక్ మూన్' ప్రత్యక్షం అవుతుంది. ఇది ఐరోపా, ఆఫ్రికా, ఆసియాలోని ప్రజలకు రేపు అంటే డిసెంబర్ 31న కన్పిస్తుంది. మన దేశంలో కూడా ఈ 'బ్లాక్ మూన్'ను డిసెంబర్ 31 ఉదయం 3:57 గంటలకు చూడొచ్చు.
అసలేంటీ బ్లాక్ మూన్?:ఇండియన్ క్యాలెండర్ ప్రకారం.. ఒక సీజన్లో నాలుగు అమావాస్యలు వస్తే అందులో మూడో అమావాస్యను 'బ్లాక్ మూన్'గా పిలుస్తారు. అంటే ఒక నెలలో రెండో అమావాస్య సంభవించినప్పుడు 'బ్లాక్ మూన్' అనేది ఏర్పడుతుంది. సాధారణంగా ఈ 'బ్లాక్ మూన్' చాలా అరుదుగా సంభవిస్తుంది. ఇది ప్రతి 29 నెలలకు ఒకసారి మాత్రమే వస్తుంది. సీజనల్గా ప్రతి 33 నెలలకు కన్పిస్తుంది.
'బ్లాక్ మూన్' అనేది పౌర్ణమితో వచ్చే 'బ్లూ మూన్'ను పోలి ఉంటుంది. అయితే ఇది మాత్రం అమావాస్యతో సంబంధం కలిగి ఉంటుంది. అంటే అమావాస్య తర్వాత వచ్చే రాత్రి ఈ 'బ్లాక్ మూన్' దర్శనమిస్తుంది. ఈ రాత్రి శుక్ల పక్షంలోని ప్రతిపద రాత్రి. దీనిని నవచంద్ర అని కూడా పిలుస్తారు. ఇక శుక్ల పక్షంలోని మొదటి రోజును ప్రతిపద అని పిలుస్తారు.
చంద్రుడు నిజంగానే నల్లగా కనిపిస్తాడా?:నిజానికి చంద్రుడు నల్లగా కన్పించనప్పటికీ దీని ప్రభావం ఈ రాత్రి ఆకాశంలో గణనీయంగా కన్పిస్తుంది. ఈ చీకటి రాత్రి చంద్రునిలో కొంత భాగాన్ని మాత్రమే కనిపించేలా చేస్తుంది. ఇది చాలా తక్కువగా ఉంటుంది. దీంతో ఈ తక్కువ కాంతిలో మనం నక్షత్రాలు, గ్రహాలు, సుదూర గెలాక్సీలను చూడగలం. బైనాక్యులర్ లేదా టెలిస్కోప్ ఉపయోగించి ఈ రాత్రంతా కన్పించే బృహస్పతి, సాయంత్రం ప్రకాశవంతంగా కనిపించే శుక్రుడు వంటి గ్రహాలను చూడొచ్చు.